2021ITRules | ఎన్టీఆర్ హక్కులకు రక్షణ కల్పించిన ఢిల్లీ హైకోర్టు..

2021ITRules | ఎన్టీఆర్ హక్కులకు రక్షణ కల్పించిన ఢిల్లీ హైకోర్టు..
2021ITRules | అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు, ఫోటోలు వాడితే నేరం
వ్యక్తిత్వ హక్కులు రాజ్యాంగ పరిరక్షణలోనే : కోర్టు
సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు స్పష్టమైన ఆదేశాలు
2021ITRules | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ, ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ మాధ్యమాల్లో తన పేరు, ఫోటోలు, గుర్తింపును అనుమతి లేకుండా వాణిజ్య పరమైన ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ వేశారు. ఈ విషయాన్ని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ఆయన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలను జారీ చేసింది.

ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పేరు గానీ, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, తారక్ లాంటి పేర్లు గానీ, యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ వంటి పేర్లు గానీ, అలాగే ఆయన ఫోటోలు, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వాణిజ్యపరంగా వాడితే చట్ట విరుద్దమని కోర్టు పేర్కొంది. ఎక్కడైనా ఇలా అనధికారంగా వాడినట్టు తెలిస్తే.. చట్టం ప్రకారం వెంటనే తీసేయాలని ఆదేశాలను కోర్టు జారీ చేసింది. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ఇండియాలో పెద్ద సెలబ్రిటీ అని స్పష్టం చేసిన కోర్టు.. ఎన్నో ఏళ్ల కెరీర్‌తో ఆయన ఈ మంచి పేరు సంపాదించుకున్నారని, ప్రజలకు ఆయన పేరు, ఫోటో, రూపం అంటే వెంటనే ఎన్టీఆర్ గారే గుర్తొస్తారని చెప్పింది. అందుకే ఆయన పేరు, ఇమేజ్ మీద హక్కులు ఆయనకే ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది.

ఒక వ్యక్తి పేరు, ఇమేజ్ వంటి వ్యక్తిత్వ హక్కులనేవి జీవించే హక్కు, స్వేచ్ఛతోనే కలిసి ఉంటాయని చెప్పిన ఢిల్లీ హైకోర్టు.. ఇవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 కింద రక్షణ పొందుతాయని, అలాగే కాపీరైట్ చట్టం 1957, ట్రేడ్‌మార్క్ చట్టం 1999 ద్వారా కూడా అమలు చేయవచ్చని స్పష్టం చేసింది. అదే విధంగా ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటి వాటిని కూడా కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌ను 2021 ఐటీ రూల్స్ (ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) కింద అధికారిక ఫిర్యాదుగా పరిగణించి, చట్టపరంగా కేటాయించిన సమయాల్లో దొరికిన హక్కుల ఉల్లంఘన లింక్‌లను తీసేయాలని కోర్టు తెలియజేసింది.

కోర్టు మరో ఆదేశాన్ని కూడా ఇచ్చింది.. దాని ప్రకారం ఎవరో గుర్తించని వ్యక్తులు, ఆన్‌లైన్ ట్రోల్స్ చేసేవాళ్లు, ఎవరికీ తెలియకుండా తప్పులు చేసేవాళ్లు ఎవరైనా.. ఎన్టీఆర్ గారి పేరు, ఫోటో, ఇమేజ్, గుర్తింపును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని, డిజిటల్ కంటెంట్, మోర్ఫ్ చేసిన ఫోటోలు, AI కంటెంట్ లేదా ఏదైనా టెక్నాలజీ ద్వారా ఉపయోగించకూడదని ఆదేశించింది. డిజిటల్ యుగంలో వ్యక్తిగత గుర్తింపు, పేరు, ఇమేజ్‌లను రక్షించడం చాలా ముఖ్యం. ప్లాట్‌ఫారమ్‌లు, ఇతరులు పబ్లిక్ పర్సనాలిటీలను గౌరవంగా, చట్టపరంగా మాత్రమే వాడేలాగా బాధ్యత వహించాలి. ఎవరైనా ఎన్టీఆర్ పేరు లేదా ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా ప్రవరిస్తే.. చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.
CLICK HERE TO READ ఘట్టమనేని వారసుడు జయకృష్ణకు సక్సెస్ అందించేనా?
