వెంటనే అరెస్టు చేయాలి…

వెంటనే అరెస్టు చేయాలి…
రజక కుటుంబానికి తీరని అన్యాయం…
న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాం..
అధ్యక్షుడు తిరుపతి…
శంకరపట్నం, ఆంధ్రప్రభ : అగ్ర కులానికి చెందిన కొంతమంది నాయకులు దైవదర్శనానికి వెళ్లిన రజక కుటుంబంపై కక్షపూరితంగా దాడి చేసి పసికందు మరణానికి కారణమైన నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని, బాధిత రజక కుటుంబానికి న్యాయం జరిగే వరకూ రజక కులస్తులందరం ఆ కుటుంబానికి వెన్నంటి ఉండి పోరాటాలు చేస్తామని రజక సంఘం మండల అధ్యక్షుడు తాడి చెర్ల తిరుపతి అన్నారు.
సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు శంకరపట్నం మండల కేంద్రంలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్, కొమ్మెర గ్రామంలో దైవ దర్శనానికి వెళ్లిన రజక కుటుంబంపై దాడి చేసి 2 నెలల శిశువు మరణానికి కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి నిందితుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మండల తాడి చెర్ల తిరుపతి మాట్లాడారు.

నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో, కొమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబానికి చెందిన, చిలికేశ్వరం గణేష్ కుటుంబ సభ్యులు, జాతరలో భాగంగా, దైవదర్శనానికి వెళ్లిన రజక కుటుంబాన్ని ఆ గ్రామ అగ్రకులాలకు చెందిన కొంతమంది దేవాలయంలోకి వెళ్తున్న గణేష్ కుటుంబ సభ్యులను అడ్డుకొని, కక్షపూరితంగా దాడి చేయడంతో గణేష్ భార్య సంకలో ఉన్న రెండు నెలల చంటి బిడ్డ మృతి చెందిన ఘటన చోటుచేసుకుందని, అగ్రకులాలకు చెందిన వ్యక్తులు రజక కుటుంబం పై దాడి చేసి, 2 నెలల పసికందు మృతికి కారకులైన వారిపై వెంటనే చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకొని నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
రజక కుటుంబానికి న్యాయం జరిగే వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రజక కుల బాంధవులందరం ఆ కుటుంబానికి అండగా ఉండి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైన పోలీసులు తక్షణమే నిందితులను అరెస్టు చేసి బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలని తిరుపతి కోరారు. ఈ కార్యక్రమంలో మొలంగూర్ ఉప సర్పంచ్ దండు రాజేష్, హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్, బిజెపి పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, బీసీ సంఘాల నాయకులు సంజయ్, అభిలాష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రాములు, సారయ్య, రజక సంఘం నాయకులు, శంకరయ్య, శ్రీనివాస్, ఆదిత్య, ఎల్లయ్య, సమ్మయ్య, శివ, తో పాటు వివిధ గ్రామాల రజక సంఘం నాయకులు, కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
