Nandyal Tribute: ఉయ్యాలవాడ ఘ‌న నివాళి Andhra Prabha News

Nandyal Tribute : ఉయ్యాలవాడ ఘ‌న నివాళి Andhra Prabha News

కలెక్టరేట్‌లోడీఆర్ఓ పుష్పాంజ‌లి

బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై తొలి సాయుధ పోరాటం

కోయిలకుంట్ల ఖజానాపై దాడితో చరిత్ర సృష్టి

యువతకు స్ఫూర్తిదాయకం నరసింహారెడ్డి త్యాగం

( నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ)

…నంద్యాల జిల్లా లోని కోయిలకుంట్ల నియోజకవర్గం లో ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని జిల్లా రెవెన్యూ అధికారి డి. రాము నాయక్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి కార్యక్రమ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు 1806 నవంబర్ 24న నంద్యాల జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించారన్నారు. 1857 తొలి భారత స్వాతంత్ర్య సమరానికి పదేళ్ల ముందుగానే, 1846 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం ప్రారంభించిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిన్నారు. ఆయన తిరుగుబాటు 1847 ఫిబ్రవరి 22న ఆయన వీరమరణంతో ముగిసినా, స్వాతంత్ర్య స్పూర్తికి ప్రేరణగా నిలిచిందన్నారు. 1846లో కోయిలకుంట్ల ఖజానాపై దాడి చేసి బ్రిటిష్ అధికారాన్ని సవాలు చేసారని తెలిపారు. రుద్రవరం వెళ్లే దారిలో ఒక అటవీ అధికారిని హతమార్చిన ఘటన బ్రిటిష్ సర్కార్‌ను కుదిపేసిందన్నారు. అనంతరం బ్రిటిష్ సైన్యం ఆయన కుటుంబ సభ్యులను బంధించగా, వారిని రక్షించేందుకు నల్లమల అటవీ ప్రాంతానికి నరసింహారెడ్డి వెళ్లారన్నారు. చివరికి కోయిలకుంట్లలో అరెస్టై, 1847 ఫిబ్రవరి 22న ఆయనను ఉరితీశారన్నారు. బ్రిటిష్ పాలకులు సంప్రదాయ వ్యవసాయ వ్యవస్థలో చేసిన మార్పులు, అధిక పన్నుల విధానం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయన్నారు. బ్రిటిష్ వారికి నేరుగా పన్ను చెల్లించడానికి నిరాకరించిన నరసింహారెడ్డి, తన పెన్షన్ విషయమై పంపిన వినతిపత్రానికి కోయిలకుంట్ల తహశీల్దార్ అవమానకరంగా స్పందించడం కూడా తిరుగుబాటుకు దారితీసిందని డిఆర్ఓ తెలిపారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Leave a Reply