15thFeb2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

15thFeb2026sunday | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్ర‌భ‌ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.. 
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.

15thFeb2026sunday | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

1. కోటి లింగాల మధ్య కైలాసనాథుని వైభవం

2. బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో గుడిమల్లం శివాలయం

3. కబుర్లు (శీర్షిక)

4. సన్నిహితం(శీర్షిక)

5. మెదడుకు మేత-సామెత(శీర్షిక)

6. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

7. వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

-____________________-____________________-____________________

1 ముఖపత్ర కథనం(1)

15thFeb2026sunday | కోటి లింగాల మధ్య కైలాసనాథుని వైభవం – 108 అడుగుల మహా లింగం సాక్షిగా ఆధ్యాత్మిక అద్భుతం

15thFeb2026sunday
15thFeb2026sunday

కోటి లింగాల మధ్య కైలాసనాథుని వైభవం

108 అడుగుల మహా లింగం సాక్షిగా ఆంధ్ర సరిహద్దులో ఆధ్యాత్మిక అద్భుతం

శ్రీ మంజునాథ చిత్రానికి సాక్ష్యమైన దివ్యక్షేత్రం

నంది సమక్షంలో కోటి లింగాల దర్శనం

శివభక్తులను ఆకట్టుకుంటున్న మహాక్షేత్రం

శివనామ స్మరణతో మార్మోగే పుణ్యక్షేత్రం

మహాశివరాత్రికి భక్తి జన సముద్రం

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు : కర్ణాటకలోని కోలార్ జిల్లా కమ్మసంద్ర గ్రామంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు అతి సమీపంలో వెలసిన కోటిలింగేశ్వర స్వామి క్షేత్రం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి జ్యోతితో ప్రకాశించే అపూర్వ శైవ పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది. “కోటి లింగాల క్షేత్రం” అనే అర్థాన్ని కలిగిన ఈ దేవస్థానం, పరమశివుని అనంత తత్త్వాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక కేంద్రంగా దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులను ఆకర్షిస్తోంది. 108 అడుగుల ఎత్తైన మహా శివలింగం, 35 అడుగుల ఎత్తైన నంది విగ్రహం, లక్షలాది చిన్న శివలింగాలతో విస్తరించిన ఈ ఆలయ సముదాయం దర్శనార్థుల హృదయాల్లో భక్తి, భయం, ఆరాధన భావాలను కలగజేస్తుంది.

స్వామి సంభ శివమూర్తి మహాస్వామి 1980 ప్రాంతంలో దైవ దర్శనంతో ఈ క్షేత్రాన్ని స్థాపించినట్లు పురాణ విశ్వాసం. పరమశివుని అనుగ్రహంతో కోటి శివలింగాలను ప్రతిష్టించాలనే మహత్తర సంకల్పంతో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక ప్రస్థానం నేటికి విశాలమైన శివక్షేత్రంగా అభివృద్ధి చెందింది. మొదట ప్రతిష్టించిన ఒక శివలింగం నుండి ప్రారంభమైన ఈ యజ్ఞం, ప్రస్తుతం 90 లక్షలకు పైగా వివిధ పరిమాణాల శివలింగాలతో మహత్తర ఆధ్యాత్మిక అరణ్యంలా రూపుదిద్దుకుంది.

ఒక్క అడుగు నుండి మూడు అడుగుల వరకు ఉన్న చిన్న శివలింగాలు వరుసగా విస్తరించి ఉండటం దర్శనార్థులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. 33 మీటర్ల ఎత్తైన మహా శివలింగం ఈ క్షేత్రంలోని ప్రధాన ఆకర్షణ 33 మీటర్ల ఎత్తైన మహా శివలింగం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగాలలో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది. దీనికి ఎదురుగా ప్రతిష్టించిన 11 మీటర్ల ఎత్తైన నంది విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

60 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు ఉన్న వేదికపై నంది ప్రతిష్టించబడటం ఈ ఆలయ వైభవాన్ని మరింత పెంచింది. శివలింగ సమీపంలో ఉన్న పవిత్ర కుండలో భక్తులు అభిషేక జలాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా కోటిలింగేశ్వర క్షేత్రం భక్తి సముద్రంగా మారుతుంది. రాత్రంతా జపాలు, రుద్రాభిషేకాలు, లింగార్చనలు, భజనలు జరుగుతుండగా “ఓం నమః శివాయ” నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగుతుంది. వేలాది మంది భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి రాత్రంతా జాగరణ చేస్తూ శివనామ స్మరణలో లీనమవుతారు.

దీపాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక ప్రకాశంతో కాంతులీనుతూ కైలాస వాతావరణాన్ని తలపిస్తుంది. ఈ ఆలయ విశిష్టతల్లో ఒకటి భక్తులే తమ పేర్లతో శివలింగాలను ప్రతిష్టించుకోవడం. కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, శాంతి, మోక్షం కోసం భక్తులు శివలింగాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. ప్రతిష్టించిన ప్రతి లింగానికి నిత్య పూజలు జరుగుతుండటం ఈ క్షేత్ర మహిమను మరింత పెంచుతోంది. పరమశివుడు సర్వాంతర్యామి, సర్వవ్యాప్తుడనే తత్త్వాన్ని ఈ కోటి లింగాల సముదాయం ప్రతిబింబిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. 11 ఉప ఆలయాల సమాహారం ఆలయ సముదాయంలో శివాలయం మాత్రమే కాకుండా విష్ణు, బ్రహ్మ, అన్నపూర్ణేశ్వరి, పంచముఖ గణపతి, ఆంజనేయస్వామి, వెంకటరమణ స్వామి, పాండురంగ స్వామి, సీతారామలక్ష్మణుల ఆలయాలు, కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయాలు సహా మొత్తం 11 ఉప ఆలయాలు ఉన్నాయి.

అన్ని దేవతా సంప్రదాయాలను సమన్వయం చేసిన ఈ క్షేత్రం భారతీయ సనాతన ధర్మ సమగ్రతకు ప్రతీకగా నిలుస్తోంది. భక్తులకు ధ్యాన మందిరం, కళ్యాణ మండపం, విశ్రాంతి గృహాలు, పూజా సామగ్రి దుకాణాలు వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి రోజు నిత్య పూజలు, అభిషేకాలు ఘనంగా జరుగుతుండగా సోమవారాలు, ప్రదోష కాలం ప్రత్యేకంగా భావించబడుతుంది. అనేక కుటుంబాలు ఇక్కడ ఉచిత సామూహిక వివాహాలు కూడా నిర్వహించుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు అతి సమీపంలో ఉండటం వల్ల చిత్తూరు, పలమనేరు, కుప్పం, తిరుపతి ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. బెంగళూరు నుండి సుమారు 97 కిలోమీటర్లు, కోలార్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం రహదారి మార్గంలో సులభంగా చేరుకునేలా ఉంది.

సమీప రైల్వే స్టేషన్ కోలార్ కాగా, సమీప విమానాశ్రయం బెంగళూరు. శ్రీ మంజునాథ సినిమా షూటింగ్ ఆధ్యాత్మికతతో పాటు సినీ చరిత్రలో కూడా ఈ క్షేత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రముఖ భక్తి చిత్రమైన “శ్రీ మంజునాథ” సినిమాకు చెందిన కీలక భాగాల చిత్రీకరణ కూడా ఈ పవిత్ర క్షేత్ర పరిసరాల్లోనే జరిగిందని సినీ వర్గాలు చెబుతాయి. మహా శివలింగం, నంది విగ్రహం, కోటి లింగాల విస్తీర్ణం సినిమాకు భక్తి వైభవాన్ని మరింత జీవంతంగా చూపించాయి. ప్రకృతి సోయగాల మధ్య 15 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లుతున్న ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతిరూపంగా నిలుస్తోంది.

నగర హడావిడికి దూరంగా, ఆధ్యాత్మిక ధ్యానానికి అనుకూలమైన వాతావరణం ఇక్కడ లభిస్తుంది. నాగలింగ పుష్ప వృక్షాలు, విశాలమైన ప్రాంగణం, వరుసగా నిలిచిన శివలింగాలు దర్శనార్థులకు దివ్యానుభూతిని కలిగిస్తాయి. ముఖ్యంగా మహాశివరాత్రి నాడు లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి చేరుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. “శివ దర్శనం చేసినవారికి శాంతి, సమృద్ధి, మోక్షం లభిస్తాయి” అనే విశ్వాసంతో భక్తులు కోటిలింగేశ్వరుని దర్శించుకుంటారు. పరమశివుని అనంత తత్త్వానికి ప్రతీకగా నిలిచిన ఈ కోటి లింగాల క్షేత్రం, సరిహద్దులను దాటి భక్తి సమైక్యతను చాటుతూ దక్షిణ భారతదేశంలో అత్యంత విశిష్ట శైవ పుణ్యక్షేత్రంగా ఖ్యాతి గాంచుతోంది.

సాటి. గంగాధర్

ఆంధ్రప్రభ, చిత్తూరు బ్యూరో.

___________________—————______________————-____________________

2. ముఖపత్ర కథనం(2)

బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో గుడిమల్లం శివాలయం


‎2600 ఏళ్ల నాటి ప్రాచీన శివాలయం
‎మానవాకారంలో శివుడు
‎ఏకశిలపై త్రిమూర్తులు
‎ఋగ్వేదం కాలం నాటి ఆహార్యం
‎శ్రీ పరశురామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
‎ఈనెల 17 వరకు బ్రహ్మోత్సవాలు
‎బాపట్ల బ్యూరో (ఆంధ్రప్రభ)
‎తిరుపతికి అత్యంత సమీపంలో, స్వర్ణముఖి నది ఒడ్డున చరిత్ర పుటల్లో మరుగునపడి ఉన్న ఒక అద్భుతమైన శివాలయం. భారతదేశంలోనే తొలి శివాలయంగా చరిత్రకారులు భావిస్తున్న గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, అక్షరాలా 2,600 సంవత్సరాల భారతీయ ఆధ్యాత్మిక ప్రయాణానికి సజీవ సాక్ష్యం. తిరుపతికి 13-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్లం గ్రామంలో అత్యంత పురాతనమైన, నిరంతరాయంగా పూజలందుకుంటున్న శివలింగానికి ప్రసిద్ధి. శ్రీకాళహస్తి నియోజకవర్గం అయినప్పటికీ రేణిగుంట హైవే కు అత్యంత సమీపంలో గుడిమల్లం ఆధ్యాత్మిక క్షేత్రం విలసిల్లుతున్నది. ఈ నెల17వ తేదీ వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

‎గుడిమల్లం శివలింగం ప్రత్యేకత

‎దేశంలో మరే సాధారణ శివాలయాల్లో కనిపించే లింగాల మాదిరిగా గుడిమల్లం లింగం ఉండదు. ముదురు గోధుమ రంగు రాతితో చెక్కబడిన ఈ లింగం దాదాపు ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. దీని వాస్తవిక రూపం వేదకాలం నాటి స్థానిక దైవారాధనను ప్రతిబింబిస్తుంది. ఈ లింగంపై ఒక వేటగాడి రూపంలో ఉన్న రుద్రుని (శివుని) ప్రతిమ చెక్కబడి ఉంటుంది. ఆ రుద్రుడు కుడి చేతిలో ఒక గొర్రెపిల్లను, ఎడమ చేతిలో ఒక చిన్న గొడ్డలి (పరశువు) ధరించి ఉంటాడు.ఈ రుద్రుడు ఒక అపస్మార పురుషుని (మరుగుజ్జు యక్షుడి) భుజాలపై నిలబడి ఉంటాడు. ఈ రూపం శివుడు ప్రకృతితో ఎంతగా మమేకమయ్యాడో తెలియజేస్తుంది. ఈ రూపంలో శివునికి యజ్ఞోపవీతం (జంధ్యం) లేకపోవడం చరిత్రకారులను ఆశ్చర్యపరుస్తుంది.

శివుడు నిరాకారుడు. పూజలందుకోవటానికి శివలింగం రూపంలో ఆలయం లో కొలువుతిరి ఉన్నాడు. కేవలం గుడిమల్లం ఆలయంలో మాత్రమే మానవాకారంలో శివలింగం గర్భగుడిలో భక్తులచే పూజలు అందుకుంటుంది. లింగపు అగ్ర భాగము, మరియు కింద పొడవైన స్తంభ భాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పళ్ళము పడిన గీత స్పష్టంగా ఉండి, మొత్తము లింగము పురుషాంగమును పోలి ఉంది. అతి ప్రాచీనమైన సైవారాధన లింగముగా చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ఆర్యుల రాకకు పూర్వపు సంప్రదాయాలను, క్రీ.పూ. 2 లేదా 3వ శతాబ్దం నాటి కాలాన్ని ప్రతిబింబిస్తుందని పురావస్తు శాఖ అంచనా వేసింది.

‎ఆలయ పురాణ గాథ

‎ఈ ఆలయాన్ని పరశురామేశ్వరాలయం అని పిలవడానికి ఒక పురాణ గాథ ఉంది. తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవి శిరస్సు ఖండించిన పరశురాముడు, బ్రహ్మహత్యా పాతకానికి గురవుతాడు. పాప పరిహారం కోసం స్వర్ణముఖి నది తీరానికి వచ్చి, ఇక్కడ ఒక మేడి చెట్టు కింద ఉన్న పుట్టలో ఈ అద్భుత శివలింగాన్ని కనుగొని ఘోర తపస్సు చేశాడు. పరశురాముని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై, అతనికి పాపవిమోచనం కలిగించాడని స్థల పురాణం చెబుతోంది. 1991 లో గోపీనాథరావు అనే పురాతత్వ శాస్త్రవేత్త ఈ శివాలయం పై సంవత్సర కాలం పాటు అనేక పరిశోధనలు చేసి ఈ దేవాలయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఉత్తర ప్రదేశ్ లోని మధుర లో ఉన్న మ్యూజియంలో క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దానికి చెందినది అంటూ ఒక లింగాన్ని భద్రపరిచారు. అది గుడిమల్లం శివలింగాన్ని పోలి ఉంది అని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన మరికొంత సమాచారం చంద్రగిరి కోటలోని మ్యూజియంలో లభ్యమవుతుందని తెలియజేస్తున్నారు. ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయంగా పేర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న శాసనాలను బట్టి భారతదేశంలోనే అతి ప్రాచీనమైన శివాలయం గా చరిత్రకారులు గుడిమల్లం శివాలయాన్ని చెబుతున్నారు. 2600 సంవత్సరముల నాటి అతి ప్రాచీన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆలయము నందు ఏకశిలపై త్రిమూర్తులు బ్రహ్మ అక్షరూపం విష్ణువు పరశురామ అవతారం శివుడు పురుష లింగాకారంతో స్వర్ణముఖి నదీ తీరమున వెలసి ఉండుట ఇక్కడి విశేషం గర్భాలయ నిర్మాణం శివలింగాకృతిలోనూ గోపురం గజపుష్టి ఆకారంలో ఉంటుంది 2005 డిసెంబర్ 4వ తేదీన స్వర్ణముఖి నది జలం స్వామివారిని అభిషేకించినదని ఉత్తరాయణం నుండి దక్షిణాయనకి మారే దిశలో సూర్యకిరణాలు మూలవిరాట్ను తాకుతాయని ఆలయ అర్చకులు తెలియజేస్తున్నారు. 60 సంవత్సరములకు ఒక సారి స్వర్ణముఖి తీర్థము స్వామివారిని తాకుతుందని తెలిపారు

‎కాల యంత్రం తలపించేలా వాస్తు శిల్ప అద్భుతం

‎ఈ ఆలయ గర్భగుడి గజపృష్ఠాకారంలో (ఏనుగు వెనుక భాగం ఆకారం) ఉండటం దీని ప్రత్యేకత. పల్లవులు, చోళులు, బాణ రాజులు, విజయనగర రాజుల పాలనలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. ఆలయంలోని శాసనాలు దీనికి నిదర్శనం.గుడిమల్లం కేవలం ఒక దేవాలయం కాదు, అదొక కాల యంత్రం లాంటిది. ఇక్కడికి అడుగుపెట్టగానే మనం వేల సంవత్సరాల వెనక్కి ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. భారతీయ సంస్కృతి, శిల్పకళ మరియు ఆధ్యాత్మికత యొక్క ఈ అపురూప సంగమాన్ని చూసిన అనుభూతి దక్కుతుంది. ఈ దేవాలయంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, శ్రీ సూర్య భగవానుడి దేవాలయం, శ్రీ పార్వతి దేవి దేవాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

‎ఏలా వెళ్ళాలి

‎చిత్తూరు జిల్లాలోని రేణిగుంటకు 11 కిలోమీటర్ల దూరంలో గుడిమల్లం పరశురామేశ్వరాలయం ఉంది. తిరుపతి నుంచి 22 కిలోమీటర్లు ఉంటుంది. తిరుపతి, చిత్తూరు, రేణిగుంట నుండి బస్సు సౌకర్యం ఉంది. ఆటోలు, కారులు, జీపులు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం సమయంలో దేవాలయంలో ఉచిత అన్న ప్రసాదం జరుగుతుంది.

‎11 నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

‎శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 11వ తేదీ నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కోటి రామచంద్రారెడ్డి తెలిపారు.
11వ తేదీ ద్వాజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
గ్రామ దేవత ఏకారమ్మ పూజ అనంతరం
గణపతి పూజ,
పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన.
తొలి రోజు అభిషేకం, ద్వాజారోహణం, పెద్ద శేష వాహనంపై ఊరేగింపు,
12వ తేదీ అభిషేకం, సూర్యప్రభ, మూషిక వాహనంపై ఊరేగింపు,
13వ తేదీ అభిషేకం, వృషభ వాహనంపై ఊరేగింపు,
14వ తేదీ అభిషేకం, సింహ వాహనంపై ఊరేగింపు,
15వ తేదీ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పల్లకి సేవ,
16వ తేదీ అభిషేకం, అధికార నంది వాహనంపై ఊరేగింపు,
17వ తేదీ గిరి ప్రదక్షిణ, అభిషేకం, మూషిక వాహనం, నెమలి వాహనం, సింహ వాహనం, వృషభ వాహనంతో మూర్తిశ్వర గ్రామోత్సవం, గిరి ప్రదక్షిణాలు.

పల్లపోలు మురళి కృష్ణ,
ఆంధ్రప్రభ బ్యూరో ,బాపట్ల జిల్లా



————————————————————————————————–


3 కబుర్లు (శీర్షిక)

DEC 2025

అసలైన ఆనందం

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారిని ఒక రేడియో ఇంటర్వ్యూలో ప్రెజెంటర్ ఒక ప్రశ్న అడిగారు: “సార్, మీ జీవితంలో మీరు అత్యంత సంతోషాన్ని పొందిన క్షణం ఏది?”

టాటా గారు నవ్వుతూ ఇలా సమాధానమిచ్చారు: “నేను నా జీవితంలో నాలుగు దశలను దాటాక, అసలైన ఆనందం అంటే ఏమిటో తెలుసుకున్నాను. మొదటి దశలో, సంపదను కూడబెట్టడం ఆనందం అనుకున్నాను. కానీ అది సంతృప్తిని ఇవ్వలేదు. రెండో దశలో, ఖరీదైన వస్తువులను సేకరించాను. కానీ ఆ మెరుపు కొద్దిరోజులకే వాడిపోయింది. మూడో దశలో, అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాను. ఆసియాలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారానికి యజమానిని అయ్యాను. కానీ ఆ గెలుపు కూడా నా మనసుకి పూర్తి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది.అప్పుడు నాలుగో దశ వచ్చింది.

“ఒక స్నేహితుడి కోరిక మేరకు, సుమారు 200 మంది వికలాంగ పిల్లల కోసం నేను చక్రాల కుర్చీలను (Wheelchairs) కొన్నాను. నా చేతులతోనే వాటిని అందించాలని నా స్నేహితుడు పట్టుబట్టడంతో ఆ పిల్లల దగ్గరకు వెళ్లాను.”

ఆ పిల్లలు ఆ కుర్చీల్లో కూర్చుని, అటూ ఇటూ తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా గడపడం చూసి రతన్ టాటా గారికి వింతైన అనుభూతి కలిగింది. ఆ పసివాళ్ల ముఖాల్లో కనిపించిన వెలుగు ఆయనలో మొదటిసారి ఒక నిండైన తృప్తిని నింపింది.

టాటా గారు తిరిగి వెళ్లబోతుండగా, ఒక బాలుడు పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. టాటా గారు ఆశ్చర్యపోయి, మెల్లగా కాళ్లను విడిపించుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఆ అబ్బాయి వదలలేదు. టాటా గారు వంగి ప్రేమగా అడిగారు, “ఏమ్మా.. నీకు ఇంకేమైనా కావాలా?”
అప్పుడు ఆ బాలుడు చెప్పిన మాట ఆయన గుండెను తాకింది:

“నేను మీ ముఖాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నాను. రేపు నేను స్వర్గానికి వెళ్ళినప్పుడు, మిమ్మల్ని గుర్తుపట్టి మరోసారి ‘థాంక్యూ’ చెప్పాలి కదా!”

ఆ మాట విన్న రతన్ టాటా గారు ఒక్క క్షణం నిశ్చేష్టులయ్యారు. జీవితం పట్ల ఆయన దృక్పథమే మారిపోయింది.

మనం పోగుచేసే ఆస్తులు, హోదాలు మనల్ని తాత్కాలికంగా మెరిపించవచ్చు. కానీ, ఒకరి కన్నీటిని తుడిచినప్పుడు , ఒకరి జీవితంలో వెలుగు నింపినప్పుడు కలిగే ఆత్మీయమైన ఆనందం కలకాలం నిలిచిపోతుంది.

మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు, మనల్ని స్వర్గంలో గుర్తించి కృతజ్ఞతలు చెప్పే మనసు ఒక్కటైనా మనం సంపాదించుకున్నామా?


———————————————————————-


4.సన్నిహితం… శీర్షిక

DEC 2025

డిప్రెషన్

ఈ మధ్య తరచుగా మనం ఆత్మహత్యల వార్తలు పేపర్లో చదువుతున్నాం , మీడియాలో చూస్తున్నాం. ఈ ఆత్మహత్యలకు ముఖ్య కారణం డిప్రెషన్ అని అందరూ చెబుతున్నారు . అయితే నాకు అర్థం అయినంత వరకు ఈ డిప్రెషన్ కి మూల కారణం విపరీతమైన ఆశ , జీవితం నుండి బోలెడంత expectations , మన శక్తి , మన పరిథి తెలుసుకోలేక పోవడం …ఇలా కొన్ని కారణాలు ఉంటాయి . అయితే ఇటువంటి డిప్రెషన్ మనల్ని దరిచేరుతుంది అని తెలిసినప్పుడు వీలైనంత వరకు దాని మూల కారణాన్ని కనుగొని దాన్ని ఎవాయిడ్ చెయ్యాలి .
దీనికి చిన్న ఉదాహరణ చెబుతాను . నేను ఒక వ్యక్తిని విపరీతంగా అభిమానించి , వారిలాగే నేను కూడా ఆ రంగంలో ఎదగాలి అని ఆశ పడి , అది ఎంతకీ సాధ్యం కాకపోతుండటంతో నెమ్మదిగా డీలా పడసాగాను . సోషల్ మీడియాలో నా పోస్ట్ లు కూడా ఆ ఫీలింగ్ ని ప్రతిబింబించేవి . ఒక ఫ్రెండ్ నా పోస్ట్ లు చదివి , ” జాగ్రత్త ..డిప్రెషన్లోకి వెళ్తావు ” అని హెచ్చరించడంతో అలెర్ట్ అయ్యాను . నా బాధకు మూలకారణం గురించి అలోచించి ముందు నేను అభిమానించే ఆ వ్యక్తిని దూరం పెట్టాను . కొంత ఉపశమనం కలిగింది . అలాగే ఆ వ్యక్తి విజయానికి కారణం అయిన కృషిని మాత్రమే ఆదర్శంగా తీసుకున్నాను . ఇంకొంత ఉపశమనం కలిగింది . అలాగే నా పరిస్థితి , పరిమితి తెలుసుకున్నాను .ఆ వ్యక్తి విజయానికి సహకరించిన అప్పటి పరిస్థితులను అర్థం చేసుకున్నాను. పూర్తిగా ఉపశమనం కలిగింది .
.. ఇలా root cause ని పట్టుకుని దాన్ని నిర్మూలించాలి . అంతే కానీ భ్రమల్లో బ్రతుకుతూ , ఒకరితో పోల్చుకుని డిప్రెస్ అయి జీవితాల్ని పాడు చేసుకో కూడదు .. అలాగే మనకున్న అవకాశాల్ని వాడుకుంటూ వృద్ధి లోకి వెళ్ళాలి. డిప్రెషన్ కి ఇదే నాకు తెలిసిన సొల్యూషన్ ఫ్రెండ్స్ .అంతే కదా !!!



5.మెదడుకు మేత-సామెత.. శీర్షిక

సింగినాదం జీలకర్ర

‘శృంగనాదం’ అన్న పదం నుంచి ‘సింగినాదం’ పుట్టిందంటారు. శృంగం అంటే కొమ్ము. లోపల డొల్లగా ఉంటుంది. దాన్ని ఊదితే ధ్వని వస్తుంది. రేవు దగ్గరికి పడవలు వచ్చాయని తెలుపడానికి కొమ్ము బూరా ఊదేవారు. ఈ సామెత వెనుక ఒక కథ ఉందండోయ్!


శ్రీకృష్ణదేవరాయలు మరణించిన తర్వాత (అంటే 16వ శతాబ్దంలో), రాజ్యంలో అరాచకం ప్రబలిందట. అప్పుడే ముస్లిం దండయాత్రలు మొదలయ్యాయి. వారు ఊళ్ళపై పడి దోచుకునేవారు. పైగా తాము వచ్చి ఊరి బయట ఉన్నట్లు ‘శృంగనాదం’ చేసేవారు. ఆ బూర ధ్వని వింటూనే ప్రజలు కకావికలై, మూటాముల్లె సర్దుకుని పారిపోయేవారు.


అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ ప్రాంతం నుండి వర్తకులు పడవలలో జీలకర్ర బస్తాలు వేసుకొని వచ్చేవారట. వారు కూడా మరొక విధమైన కొమ్ము బూరతో ధ్వని చేసేవారు. ఆ శృంగనాదం దోపిడీదారులదో, జీలకర్ర వ్యాపారులదో తెలియక ప్రజలు తికమక పడుతూంటే, తెలిసినవారు “ఈ సింగినాదం జీలకర్ర వాళ్లది! భయపడకండి!” అని ధైర్యం చెప్పేవారట. ఈ ధ్వనిని పట్టించుకోనవసరం లేదని, దానర్థం.


రాన్రాను జనాల నాలుకలలో పడి ఇది ‘ఎంతో హడావిడి చేస్తే, చివరకు ఏమీ లేదని తేలడం’గా ప్రాచుర్యం పొందింది. అసలు కథను శ్రీమాన్ ఉషశ్రీ గారు తమ ‘ధర్మసందేహాలు’లో వివరించారొకసారి.
‘లైట్ తీస్కో’ అనే అర్థంలో కూడా దీన్ని వాడుతున్నారు కొందరు. సింగినాదం సరేగాని, జీలకర్ర మాత్రం చాలా ఖరీదైనది, విలువైనదండోయ్! పోపులపెట్టెకు రాణి అది. పెళ్లిళ్లలో దాన్ని ముద్ద బెల్లంతో కలిపి వధూవరుల నెత్తిన పరస్పరం పెట్టిస్తారు. ఈ మిశ్రమం అన్యోన్యతకు సింబల్. తీపి, చేదు కలిసి అనుభవించమని.. ఈ ‘గుడజీరక’ మిశ్రమం బ్రహ్మరంధ్రాన్ని తెరిపించే శక్తి కలిగి ఉంటుందని శాస్త్రం చెబుతున్నది. జీలకర్ర, బెల్లం తలల మీద పెట్టడంతోనే అసలు ముహూర్తం మొదలు. తాళి కట్టడం సెకండరీనే.


ఎవరైనా, పెద్దగా ప్రాధాన్యత లేని విషయాన్ని గోరంతను కొండంత చేసి చూపిస్తే, ‘ఆఁ, పోదురూ బడాయి! సింగినాదం! జీలకర్ర!’ అని కొట్టిపారేస్తాం. రాహుల్ గాంధీగారు, ఇంకా ప్రచురణే కాని, మాజీ సైన్యాధిపతి నరవణే గారి పుస్తకం ‘ది ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ లోని కొన్ని భాగాలు పట్టుకుని, పార్లమెంటులో నానా రభస చేస్తున్నారు. దాన్ని బిజెపి వాళ్లు ‘సింగినాదం.. జీలకర్ర’ అని కొట్టి పడేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లది శృంగనాదం, బిజెపి వాళ్లది జీలకర్ర!


మమతా బెనర్జీగారు ఎప్పుడో న్యాయశాస్త్రం చదివారు. ఓటర్ల జాబితాను సవరించే S.I.R. (Special Intensive Revision) కు ఆమె వ్యతిరేకం. ఆమె ‘సింగినాదం’ (వితండవాదం) విచిత్రంగా ఉంది. ఓటర్ల జాబితా సవరణలో చేరికలే గాని తొలగింపులు ఉండకూడదట. ఆ మేరకు ఆమె స్వయంగా సుప్రీంకోర్టులో వాదించారు. ‘న్యాయం ఏడుస్తూంద’ని బాధపడ్డారు. చివరికేమైంది? ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు సృష్టం చేశారు. ఏమని? ‘S.I.R. ను పూర్తి చేయడంలో ఎన్నికల సంఘానికి ఎలాంటి అవరోధాలు ఉండకూడదు. రాష్ట్రాలన్నీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అని. సో, మమతమ్మ వాదన అరణ్యరోదనయింది. ‘సింగినాదం జీలకర్ర’ అయింది!


ట్రంప్ చేసి పనులు కూడా ఇలాగే ఉంటాయి. గొప్పలు చెప్పుకోవడంలో ఉత్తరకుమారుని ఆయన ఓడించేశాడు. ప్రపంచాన్ని తన టారిఫ్‌లతో గడగడలాడిస్తానని అనుకుంటాడు. కాని ఆ పటాటోపమంతా ‘సింగినాదం జీలకర్ర’గా మిగిలిపోతుంది. “లేస్తే మనిషిని కాదు” అని బెదిరిస్తుంటారు కొందరు. అదీ ఇలాంటిదే! అసలు లేస్తే కద! ‘మాయాబజార్’లో లక్ష్మణకుమారుని సారథి (అంజిబాబు) తలుపును భుజంతో విసురుగా తోయబోతే అది ఠక్కున తెరుచుకొని దొర్లుకుని పడిపోతాడు. అప్పుడు శర్మ, శాస్త్రి (అల్లు, వంగర) “అదేమిటండీ! అట్లా పడిపోయినారు?” అంటే, “అబ్బే! నేనెక్కడ పడిపోయినాను? మొగ్గ లేశానంతే!” అంటాడు, సింగినాదం, జీలకర్ర అన్నట్లుగా!
కాబట్టి, ప్రతిదీ హైప్ చేస్తే పట్టించుకోమాకండి!


సో, ఇంకో సామెతతో వచ్చేవారం.

============================================================================

6. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

శివరాత్రి – పేద ప్రజల రాత్రి

ఆకలి, చీకటి, అజ్ఞానం ఒక దానితో ఒకటి పెనవేసుకుని విడదీయరాని బంధంగా ఏర్పడితే ఎంత ప్రమాదం?!

ప్రజల ఆకలి సమస్య తీరాలి! ఇది కేవలం భౌతికమైన విషయం కాదు! ఇంకా లోతైనది! అన్నం దొరికింది! మరి రేపు? ఎల్లుండి? ఇంకో సంవత్సరం తర్వాత?

జీవితాంతం నాకు ఆహారం దొరుకుతుంది అనే మానసిక భరోసా అవససం! అలాగే ఒకరోజు తినకపోయినా ఏం కాదు అనే ధైర్యం కూడా అవసరం!

మహా శివరాత్రి గొప్ప సందేశాల్లో అది ఒకటి. సాధన! మాటలు కాదు, అనుభవంతో అర్థం కావాలి!

ఫాల్గుణ మాసంలో మొదటి అర్ధ భాగంలో (14 వ రోజు) ఈ మహా శివరాత్రి వస్తుంది అని మనకు తెలుసు!

గ్రామాల్లో సామూహికంగా ఉపవాసాలు ఉండడం, భక్తి, భజన, శివనామస్మరణ, పంచామృతాలతో అభిషేకం…మాటలు, ఆటలు, పాటలు…

ఒక్క టికెట్ పై రెండు సినిమాలు, కరీంనగర్, కాగజ్ నగర్, ఇందూరు(నిజామాబాద్), బాన్సువాడ, భీమవరం, ఉండి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, కాకినాడ, విశాఖ పట్నం… రెండు తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి రోజు ఒక్క టిక్కెట్టు రెండు సినిమాలు ఇరవై, ముప్పై ఏళ్ల క్రితం ఒక ఊపు ఊపాయి!

భక్తి, జ్ఞాన, వైరాగ్యాల్లో ప్రజలు ఎంత ఎదిగారో కాలం సాక్ష్యం చెబుతుంది! ఎదిగింది తక్కువ!

“ఏ వేదంబు పఠించె లూత…, దూర్జటి మహర్షి మాటలు అజ్ఞానంతో అన్నిటికీ అన్వయం చేయవొద్దు! Process makes better than your expectation అన్న మాట అర్థం చేసుకుందాము!

“…జ్ఞాన లక్ష్మీ జాగ్రత్ప్రరిణామ మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా ! ” అది మన లక్ష్యం కావాలి.

Spiritual awakening, rituals and cultural unity చేయి చేయి కలిపి సాగాలి! ఆ కాస్మిక్ ఎనర్జీ మన మనసుల్లో అంతర్గత పరివర్తనను కలిగించాలి!

శైవ సాంప్రదాయ సాధన ఎన్నో సమస్యలకు పరిష్కారం అని ఒక బలమైన వాదం ఉంది!

ఎన్నో వందల ఏళ్ల నుంచి పేద ప్రజల జీవితాల్లో ఎన్నో ఆకలి రాత్రులు జరిగాయి! ఎన్నో శివరాత్రులు! ఆ పరిస్థితులు ఇప్పుడు చాలావరకు మారాయి!

తిండిలేక కాదు, తిండి ఎక్కువ తిని, తిన్నది అరగక రోగాలు బారిన పడుతున్న రోజులు కూడా ఇప్పుడు నడుస్తున్నాయి! ఉపవాసం కూడా ఏదో ఒక సంస్థలో వేల రూపాయలు డబ్బులు కట్టి కోర్సుగా జాయిన్ అయ్యి నేర్చుకోవాలి! ఎందరో అలా నేర్చుకుంటున్నారు!

మన మహా శివరాత్రి మహా ప్రసాదంగా ఉచితంగా, ఆ జ్యోతిర్లింగం నేర్పుతుంది! శివ పార్వతుల కళ్యాణంతో పాటు, లింగోద్భవం జరిగిన రోజు కూడా కదా!

కొన్ని మంచి ఆలోచనలు చేయడానికి, సమాజ శ్రేయస్సు కోసం, కుటుంబ బంధాలు బలపడడానికి, స్నేహితులు కలిసి గొప్ప విషయాలు చర్చించ డానికి, భక్తితో పాటు, కథలు, కవిత్వం, నాటకం, A I, Cloud technology, quantum computing.. ఇలా…ఇంకా ఎన్నో వైజ్ఞానిక విషయాలు చర్చించ డానికి ఈ మహా శివరాత్రి గొప్ప వేదిక కావాలి అని కోరుకుందాం! ఆకలి, చీకటి, అజ్ఞానం అన్నీ తొలగాలి! శివోహం!


___________________________________________________________

7.వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

తిరుమల క్షేత్ర పాలకుడు, మహాదేవుడు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పుణ్య క్షేత్ర పాలకుడుగా మహాదేవుడు పూజలందుకుంటున్నారు. తిరుమలేశుని ఆలయంలోని ధ్వజ స్థంభం ముందున్న బలిపీఠానికి ఈశాన్య మూలలో ఒకటిన్నర అడుగుల ఎత్తైన శిలా రూపాన్ని సాక్ష్యాత్తు మహాశివుని ప్రతిరూపమైన క్షేత్రపాలక శిల అంటారు. శతాబ్దాల క్రితం మరింత రెట్టింపు బరువుగా ఉండే ఆ శిల ఆలయమంతా తిరుగాడుతూ రక్షక బాధ్యతలను నిర్వహించేదని, ఒకసారి రాత్రివేళ ఆలయంలో పొరబాటుగా చిక్కుబడి పోయిన బాలుడు ఆ శిల కింద పడి మరణించాడని, అప్పుడు రెండు ముక్కలైన ఆ శిల లో కొంత భాగం అక్కడే ఉంచి, మిగిలిన భాగాన్ని గోగర్భ తీర్థం లో ప్రతిష్టించారని స్థల పురాణం పేర్కొంటోంది.


మహాశివరాత్రి పర్వదినాన తిరుమల ఆలయ అర్చకులు గోగర్భ తీర్థం వద్ద ఉన్న క్షేత్ర పాలక శిల వద్దకు మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ ప్రతిష్టించి ఉన్న శిలా రూపానికి అభిషేకం నిర్వహించి వెండి నామాలు, కళ్ళు అతికించి అర్చనలు చేసి, ప్రసాద సమర్పణలు చేస్తుంటారు. ఇంకోవైపు ప్రతిరోజూ అర్చకులు ఏకాంత సేవ తరువాత గుడి మూసివేసి ఇంటికి వెళ్ళేటప్పుడు, ఉదయం సుప్రభాత సేవకు వచ్చే టప్పుడు గుడి తాళాలను ధ్వజస్తంభం వద్ద ఉన్న క్షేత్రపాలక శిల కు తాకించి వెళ్లే సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. ఇప్పటికీ ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతూ ఉంది.
శివ కేశవులకు తేడా లేదని చాటి చెబుతూ తిరుమల క్షేత్ర పాలకుడైన మహాదేవుడి వైశిష్ట్యాన్ని ప్రతిబింబించే ఈ చరిత్ర కు ఆధారంగా ఆలయంలో ఉన్న క్షేత్ర పాలక శిల ను, గోగర్భ తీర్థం లో పూజలందుకునే శిలారూపాన్ని దర్శించుకోవచ్చును

ఓం నమో వేంకటేశాయ

మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@gmail.com

click here for more

Leave a Reply