12aprchintana | సిగ్గు–బిడియం మధ్య జీవన సత్యాలు

12aprchintana | సిగ్గు–బిడియం మధ్య జీవన సత్యాలు
12aprchintana |సిగ్గు, బిడియం – మానవ జీవితంలోని గుణాలా? అడ్డంకులా?
పూర్వీకుల సందేశం – ఎప్పుడు సిగ్గు వదలాలి?
ధనం, విద్య, జీవన విధానంలో సిగ్గు ప్రభావం
సామాజిక ప్రవర్తనలో సిగ్గు పాత్ర
అనైతిక ప్రవర్తనలో సిగ్గు అవసరం
12aprchintana | మానవులను నైతికంగా కాపాడడానికి చెడుకు, ఆశ్లీలతకు వారిని దూరముగా ఉంచడానికి సిగ్గు, బిడియం అనే రెండు ఉత్తమ గుణాలు అనాదిగా వారికి ఆభరణాలుగా పరిగణింపబడ్డాయి. ముఖ్యంగా కొత్త పరిసరాలలో, కొత్త వారితో మెలగాల్సి వచ్చినప్పుడు ఈ గుణాలు ఎక్కువ కావడం, స్త్రీలలో, పిల్లలలో ఇవి అధికంగా ఉండడం తెలిసిన విషయమే! స్త్రీలకు సిగ్గే సింగారం అని కవులు వర్ణించడమూ కద్దు. అయితే ఎదిగే పిల్లలలో సిగ్గు, బిడియం వంటివి వారి ఆత్మ విశ్వాసానికి అడ్డుపడకుండా తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని మనస్తత్వ శాస్త్రవేత్తలు సూచిస్తారు. సామాజికంగా అందరితో కలిసిపోగల కలివిడితనం ఈ సిగ్గు, బిడియం, మొహమాటం అనేవి తగ్గిస్తాయి.
మన పూర్వీకులు గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణులు. వారు, కొన్ని కొన్ని సందర్భాలలో సిగ్గు పడడం కూడదని ఇలా చెప్పారు : ”ధన ధాన్య ప్రయోగేషు… త్యక్తర్లజ్జా సుఖీ భవేత్”. ధన ధాన్యాల విషయములో, విద్యాభ్యాస సమయంలో, పాట పాడే వేళలో, వాద్యమును వాయించేటప్పుడు, నాట్యమాడే సమయంలో, యుద్ధంలో పాల్గొనునప్పుడు, శత్రు సంకటే, ఆహార, వ్యవహారేచ త్యక్తర్లజ్జా సుఖీ భవేత్. ఎంత గొప్ప సందేశం కదా ఇది.
”ఏక లజ్జాం పరిత్యజ్య త్రిలోక విజయీ భవేత్” అనే పెద్దల మాటా ఈ అభిప్రాయాన్నే ధృఢ పరుస్తున్నాయి. ”ధనమూలమిదం జగత్”. ఈ లోకంలో అన్నింటికీ ధనమే మూలం. ధర్మ మార్గంలో ధనాన్ని ఆర్జించి, సక్రమమైన పద్ధతిలో వినియోగించేవాడే వివేకి. ఆ తెలివి లేనివాడు ధనంలేక బాధపడాల్సి వస్తుంది. ఎప్పుడు దారిద్య్రం కల్గుతుందో అప్పుడు అన్ని బాధలు చుట్టుముట్టుతాయి. ”దారిద్య్రాత్ భయం ఎతి” అని భర్తృహరి చెప్పారు.

ధనాన్ని యాచించడం, అప్పు చేయడం సిగ్గు పడాల్సిన విషయాలు. అయితే తనకు రావలసిన ధనాన్ని రాబట్టుకోవడంలో సిగ్గు పడరాదు. అలాగే ఆహారం విషయంలో మొహమాట పడితే నష్టం తనకే. విద్యాభ్యాసంలో సిగ్గు పడితే నష్టం తనకే. గాయకులు, నర్తకులు, నటులు వేదికపై సిగ్గుపడితే అపహాస్యం పాలవుతారు. యుద్ధంలో వీరుడు సిగ్గుపడితే ప్రాణహాని కల్గే ప్రమాదం ఉంది.
నవ వధువు సిగ్గు పడడం సహజం. అది ఆమెకు సింగారం. అయితే అనైతికంగా ప్రవర్తించినప్పుడు, సమాజ నియమాలను ఉల్లంఘించినప్పుడు, తప్పు చేసి పశ్చాత్తాపం లేకపోతే వారికి సిగ్గు లేదు అని సమాజం భావిస్తుంది. అది వారికి సిగ్గు చేటు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మెలగడమే తెలివైన వారి లక్షణం.
– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి
