కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలి

కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలి

పెనమలూరు, ఆంధ్రప్రభ : వచ్చే మార్చి నెల 10 వ తేదీన కొనుగోలుదారులు, అమ్మకందారుల సమ్మేళనం నిర్వహణకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ పెనమలూరు మండలంలోని కానూరులో గల వి ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించి అక్కడి ఆడిటోరియంలో కొనుగోలుదారులు – అమ్మకం దారుల సమ్మేళనం ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే మార్చి నెల 10 వ తేదీన కొనుగోలుదారులు – అమ్మకముదారుల సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని 200 మంది వ్యాపారవేత్తలు వారికి సంబంధించిన వివిధ రకాల ఆహార ఉత్పత్తులు, వస్త్రాలతో ఈ సమ్మేళనంలో ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తారన్నారు. అలాగే 100 మంది దాకా కొనుగోలుదారులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారని వారంతా మన జిల్లాలోని వివిధ రకాల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్ సౌకర్యాన్ని అనుసంధానం చేస్తున్నామన్నారు.

తద్వారా జిల్లాలోని వివిధ రకాల ఉత్పత్తులకు మంచి డిమాండ్ పెరిగి జిల్లాకు చెందిన వ్యాపారవేత్తలు అధిక ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. సమ్మేళనంలో పాల్గొనే వారికి మంచినీరు తదితర వసతులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సజావుగా సమకూర్చాలన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ జి కల్పన, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, ఉయ్యూరు ఆర్డిఓ బిఎస్ హేలా షారోన్, డిఐసి జిఎం వెంకటరావు ఏపీఐఐసీ జెడ్.ఎమ్. బాబ్జి, జిల్లా ఉద్యాన అధికారి జే.జ్యోతి తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply