ఢిల్లీలో పట్టుబడిన 10టన్నుల ఎర్రచందనం 

తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : పట్టుబడిన నిందితుడి విచారణలో తెలిసిన సమాచారం ఆధారంగా ప్రణాళికా బద్ధంగా ఢిల్లీలో నిర్వహించిన దాడిలో రూ.8కోట్ల విలువైన 10 టన్నుల ఎర్రచందనం దుంగల (Red sandalwood) తో పాటు ఇద్దరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లు పట్టుబడ్డారు. శనివారం మధ్యాహ్నం ఇక్కడి ఎర్ర చందనం టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో అధికారులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంబంధిత వివరాలు వెల్లడి అయ్యాయి.

ఆ వివరాల ప్రకారం… ఈ ఏడాది మార్చి నెలలో టాస్క్ ఫోర్స్ బృందం (Task Force Team) కడప జిల్లా ఖాజీపేట మండలంలోని పత్తూరు ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్ అనే ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్ అయ్యాడు. అతడిని విచారించినప్పుడు తెలిసిన సమాచారం ప్రకారం ఢిల్లీలో ఉన్న మరికొందరు స్మగ్లర్ల గురించి తెలియడంతో టాస్క్ ఫోర్స్ హెడ్ గా ఉన్న తిరుపతి జిల్లా ఎస్ పి ఎల్. సుబ్బరాయుడు పకడ్బందీగా ప్రణాళికని రూపొందించారు.

ఆ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ పి శ్రీనివాస్ ఇన్ స్పెక్టర్ షేక్ ఖాదర్ బాష నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపించారు. ఆ బృందం ఢిల్లీలోని పోలీసుల, ఫారెస్ట్ అధికారుల సహకారంతో సౌత్ ఈస్ట్ ఢిల్లీ (South East Delhi) తుఘకాబాద్ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రధాన నిందితుడు మొహమ్మద్ ఇర్ఫాన్ ను ఈనెల 6వ తేదీన పట్టుకున్నారు. అతని ఇచ్చిన సమాచారంతో తుమ్లకాబాద్, కుయన్ మొహల్లా ప్రాంతంలోని గోదాం నంబరు 366 పై మెరుపు దాడి చేశారు.

ఆసందర్భంగా గోదాంలో అక్రమంగా దాచిన 356 ఎర్ర చందనం దుంగలను ( 9.576 టన్నుల) స్వాధీనం చేసుకుని, ఇర్ఫాన్ తో కలిసి స్మగ్లింగ్ చేసే అమిత్ సంపత్ పవార్ ను కూడా ఆరెస్ట్ చేశారు. ఆ ఇద్దరినీ నిబంధనల మేరకు ఢిల్లీ కోర్టు(Delhi Court) లో హాజరుపరచి, ట్రాన్సిట్ వారెంట్ పై తిరుపతికి తీసుకువచ్చారు. అరెస్టయిన ఇర్ఫాన్ మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి కాగా, అమిత్ సంపత్ పవార్ మహారాష్ట్ర కు చెందిన అంతర్ రాష్ట్ర స్మగ్లర్లుగా గుర్తించినట్టు టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రకటించారు.

పట్టుబడిన ఎర్ర చందనం దుంగల విలువ రూ.8 కోట్లని పేర్కొన్న అధికారులు ఈ కేసులో సంబంధం ఉన్న ప్రధాన స్మగర్లను గుర్తించి అరెస్టు చేయడానికి దర్యాప్తు కొనసాగుతోందని, అవసరాన్ని బట్టి నిందితులపై పీడీ చట్టం (PD Act) కింద కేసులు నమోదు చేస్తామని మీడియా సమావేశంలో టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు తెలిపారు. ఈ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించిన టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్, డీఎస్పీలు వి.శ్రీనివాసరెడ్డి, ఎం.డి.షరీఫ్, ఇన్ స్పెక్టర్ షేక్ ఖాదర్ బాష, ఎస్ఐఐ రఫీ, ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి, పీసీలు వంశీ కృష్ణ, షేక్ బిలాల్, చిన్న కృష్ణయ్యలను సుబ్బారాయుడు, సి సి ఎఫ్ సెల్వం సి.చంద్రన్ అభినందించారు.

Leave a Reply