ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టాలీవుడ్లో గత వారం నుంచి కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మరియు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ, ఎటువంటి స్పష్టమైన పరిష్కారం దొరకకపోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ నేపధ్యంలో, కృష్ణానగర్‌లో 24 క్రాఫ్ట్ విభాగాలకు చెందిన వందలాది మంది కార్మికులు భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
“మాకు స్కిల్ లేదని ఎలా అంటారు?
ఈ నిరసనలో పలువురు నేతలు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫైటర్స్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ – “మాకు స్కిల్ లేదని ఎలా అంటారు? స్కిల్ లేకపోతే ఇంతకాలం వందల సినిమాల్లో ఎలా పని చేసాం?” అని ప్రశ్నించారు. తాము ఎటువంటి అనవసర ఒత్తిడి చేయడం లేదని, కానీ తమ కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచాలని అడిగితే కేసులు వేయడం సరికాదని వారు మండిపడ్డారు. “సినిమాల్లో వచ్చే లాభాల్లో వాటాలు అడగడం లేదు, కేవలం మా కష్టానికి సరిపడే వేతనం మాత్రమే కోరుతున్నాం” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సమ్మె కారణంగా అనేక సినిమా షూటింగ్లు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. పెద్ద సినిమాల నుంచి చిన్న బడ్జెట్ ప్రాజెక్టుల వరకు ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. చర్చలు విఫలమైన ఈ దశలో, పరిశ్రమ భవిష్యత్తు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.
వేతనాల పెంపుపై డిమాండ్..
ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. కార్మికులు గత మూడు ఏళ్లుగా వేతన పెంపు కోరికను వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జీతాలు పెంచలేదని ఆరోపించారు. ఏడాదికి కనీసం 10% పెంపు ఇవ్వాలని, ప్రస్తుతం 30% వేతన పెంపు చేస్తేనే పని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. విడతల వారీగా సిబ్బంది కేటగిరీ విభజించి పెంపు చేయాలనే నిర్మాతల ప్రతిపాదనను వారు తిరస్కరించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తామని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే ముందు.. మరోసారి ఛాంబర్తో చర్చలకు హాజరవుతామని, కానీ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
సినీ షూటింగ్లపై ప్రభావం..
ప్రస్తుతం ఈ సమ్మె కారణంగా అనేక సినిమా షూటింగ్లు పూర్తిగా నిలిచిపోయాయి. పెద్ద సినిమాలు, చిన్న బడ్జెట్ ప్రాజెక్టులు అన్నీ ప్రభావితమవుతున్నాయి. అయితే సినిమాల్లో వచ్చే లాభాల్లో వాటాలు అడగడం లేదు, కేవలం మా కష్టానికి తగిన వేతనం మాత్రమే కోరుతున్నాం” అని కార్మికులు స్పష్టం చేశారు.
కండిషన్లు అప్లయ్..
చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకుంటూ వచ్చాం. ఇప్పుడు వచ్చిన సమస్యను కూడా తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, కార్మికులు కోరుకున్న 30 శాతం పర్సంటేజీ మాకు అనుకూలంగా లేదు. మా కండిషన్స్ వాళ్లు ఒప్పుకుంటే వేతనాలు పెంచడానికి మేము రెడీగా ఉన్నాం. రోజుకు రూ.నాలుగైదు వేలు తీసుకునే వారికి పెంచడం సాధ్యం కాదు’’ అని చెర్రీ తెలిపారు. హైదరాబాద్లో ఉన్న ఖర్చులను పరిగణనలోకి తీసుకుని రోజుకు రూ.2 వేలు లోపు తీసుకునే సినీ కార్మికుల వేతనాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. మూడు విడతల్లో వేతనాలు పెంచుతామన్నారు. రోజుకు రూ.2 వేలు లోపు ఆదాయం ఉన్నవారికి మొదటి సంవత్సరం 15 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో సంవత్సరం మరో 5 శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అలాగే రోజుకు రూ.వెయ్యి రూపాయలు తీసుకునే సినీ కార్మికులకు మొదటి సంవత్సరం 20 శాతం, రెండో ఏడాది ఏమీ లేకుండా మూడో సంవత్సరం 5 శాతం పెంచుతాం’ అని చెప్పారు.
చిన్న బడ్జెట్ సినిమాలకు మినహాయింపు
నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ చిన్న బడ్జెట్ సినిమాలకు పాత వేతనాల చెల్లింపు కొనసాగుతుందన్నారు. కార్మికులు డిమాండ్ చేసినట్లుగా చిన్న నిర్మాతలు వేతన పెంపు భారాన్ని భరించలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో వారికి మినహాయింపు ఇచ్చామని చెప్పారు. ఈ సమావేశంలో నిర్మాతలు మైత్రీ నవీన్, విశ్వప్రసాద్, నాగవంశీ, సుధాకర్ చెరుకూరి, రాధామోహన్, సాహు గారపాటి, ఎస్కెఎన్, బాపినీడు తదితరులు పాల్గొన్నారు.
నేనెవరినీ కలవలేదు: చిరంజీవి
సినీ కార్మికుల వేతనాల పెంపు విషయమై తనను ఎవరూ కలవలేదని, తాను కూడా ఎవరినీ కలవలేదని నటుడు చిరంజీవి తెలిపారు. సినీ కార్మికులు కొందరు శనివారం తనను కలిశారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ‘ఎక్స్’ లో ఆయన పోస్ట్ చేశారు. ‘‘ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్లి నేను వారిని కలిసినట్లు, 30 శాతం వేతన పెంపు వంటి డిమాండ్లను అంగీకరించినట్లు తప్పుడు ప్రకటనలు చేయడం నా దృష్టికి వచ్చింది. ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ నేను కలవలేదు. ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం. ఇలాంటి సమస్యలకు ఏకపక్షంగా హామీ ఇవ్వడం లేదా పరిష్కారం చూపడం సాధ్యం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ చాంబరే అగ్ర సంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయసమ్మతమైన పరిష్కారానికి రావడం చాంబర్ సమిష్టి బాధ్యత. అంతవరకు గందరగోళం సృష్టించే ఉద్దేశంతో చేసిన ఇలాంటి నిరాధారమైన ప్రకటనలను ఖండిస్తున్నా” అని చిరంజీవి పేర్కొన్నారు.