పోరాటం ఎజెండా మారనుందా?

పోరాటం ఎజెండా మారనుందా?

వ్యవస్థలో పేరుకుపోయిన లోపాలు, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు, నిరుద్యోగం, పెట్టుబడిదారీ వ్యవస్థ, శ్రమ దోపిడీ, అణచివేత, వీటివల్ల విసిగిపోయిన మండే గుండెల నుండి పుట్టేవే ప్రజా ఉద్యమాలు. ఈ ఉద్యమాలు పురుడు పోసుకోవడం ఒక్క రోజులో జరగదు. ఈ పోరాటాలకు పరిష్కారమూ ఒక్కరోజులో లభించదు. రగిలే అగ్నికణాల్లాంటి నిరనలు తరాలకొద్దీ మండుతూనే ఉంటాయి. ప్రభుత్వాలు వాటిని ఆర్పే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి.
ఈ క్రమంలో ప్రాణాలు పోతూనే ఉంటాయి.
ఏ ఉద్యమమైనా సిద్ధాంతపరంగా జరిగితే బాగుంటుంది. కానీ హింస మాత్రమే పరిష్కారం అనే దిశగా మారితే ప్రమాదం.
వారి హింసాత్మక చర్యలకు ప్రతీకార చర్యగా తిరిగి ప్రభుత్వాలు, వారిమీద తిరిగి వీరు…ఈ పోరాటాల తీరే మారిపోతుంది.
ఇక ప్రస్తుత విషయానికొస్తే….
మావోయిజాన్ని రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి ప్రయత్నంలో ఉన్నాయి. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిస్తున్నాయి. ఒకపక్క ఎన్ కౌంటర్ లతో
ఉద్యమాన్ని అణచివేస్తున్నాయి.
ఈ క్రమంలో తాము ఆయుధాలు వదిలేస్తామంటూ మావోయిస్టులు పంపిన సందేశం ప్రభుత్వ వర్గాల్లోనూ, పోలీసుల్లోనూ, ప్రజల్లోనూ కొత్త ఆలోచనలను, సందేహాలను రేకెత్తిస్తున్నాయి.
మావోయిస్టుల చర్యల్లో ప్రధాన పాత్ర పోషించేవే ఆయుధాలు, కాల్పులు. ప్రాణ రక్షణకైనా, పోరాటానికైనా ఆయుధమే వారి బలం.
ఆయుధాలు వదిలెయ్యడానికి ప్రతిగా వారు చేస్తున్న డిమాండ్ లు ఏమిటి? వాటిని ప్రభుత్వాలు ఎంతవరకు ఆమోదించగలవు? ఎంతవరకు అమలు పరచగలవు? అటు మావోయిస్టులు, ఇటు ప్రభుత్వాలు మాట మీద నిలబడగలవా? ఆయుధాలు వదిలేసాక వారి పోరాట ఎజెండాలో చోటు చేసుకోబోతున్న మార్పులేమిటి? ఇవన్నీ కాలమే చెప్పాల్సిన సమాధానాలు.

ఆయుధాలు వీడబోతున్నామంటూ మావోయిస్టుల నుండి విడుదలైన లేఖ వెనుక ఎన్నో సందేహాలు…ఇది మరో కొత్త వ్యూహమా అన్న కోణంలోనూ అలోచనలు.
కగార్ తో కుదేలైన మావోయిస్టులు గత్యంతరం లేకనే ఆయుధాలు వీడబోతున్నారనేది మరో వెర్షన్.
అసలు ఆయుధాలే దొరకని అసహాయ పరిస్థితుల్లో మావోయిస్టులు ఉన్నారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అగ్రనేతలందరూ వరసగా నేలకొరిగి కేదర్లన్నీ బలహీనమైపోయి, దిక్కుతోచని స్థితిలో పోరాటానికి దిశానిర్దేశం చేసేవారే కరువైపోవడమే వారు ఆయుధాలు వీడతామనే లేఖ వెనుక ప్రధానాంశంగా కనిపిస్తోంది.
ప్రభుత్వ సానుకూలంగా స్పందిస్తుందా? సానుభూతి చూపిస్తుందా? జనజీవనస్రవంతిలో కలిసిపోతామనే మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తారా..అనేవి ఇప్పటికిప్పుడు సమాధానం లేని సందేహాలు.
ఒకవేళ ఇవన్నీ జరిగితే ఇక భవిష్యత్తులో మావోల కదలికలు కనుమరుగైపోతాయా అన్నది సందేహమే. ఈ వైరాగ్యం తాత్కాలికమై, పోలీసుల దృష్టి మళ్ళించి, తిరిగి పుంజుకోవడానికి ఆస్కారం ఉందా అనేది నిగూఢం..

Leave a Reply