నేటి అలంకారము బాలాత్రిపుర సుందరి
సర్వశక్తిమయా సర్వమంగళా సద్గతి ప్రదా!
సర్వేశ్వరీ సర్వమయీ సర్వ మంత్ర స్వరూపిణీ!!

శరన్నవరాత్రులలో పాడ్యమి నాటి అవతారము బాలాత్రిపురసుందరి. త్రిపురుని అర్థాంగి కావటం వలన బాలాత్రిపురసుందరిగా కూడా పిలువబడే అమ్మ అక్షమాల మరియు అభయముద్రతో దర్శనమిస్తూ బుద్ధి, మనస్సు, చిత్తము మరియు అహంకారము అణచి వేస్తుంది. మరియు శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో ఆధి దేవత కూడా త్రిపురసుందరీదేవి. త్రిపురములలో అంటే అన్ని లోకాలలో ఈ తల్లి సౌందర్యవతి గావున ఈ తల్లిని త్రిపుర సుందరి అని పిలుస్తారు. షోడశ విద్య కొరకు సాధకులు బాలా త్రిపురసుందరిని అర్చించాలి. ఆత్మ స్వరూపురాలైన ఈవిడను పూజిస్తే శివానుగ్రహము ద్వారా మోక్షము సంప్రాప్తిస్తుంది. షోడశ వర్షిణిగా పరిగణింపబడే ఈ తల్లి భండాసురుడు అనే రాక్షస సంహారము గావించి లోకాలకు శాంతిని చేకూర్చింది. లలితా త్రిశతి స్తోత్రం అత్యంత ఫలదాయకము.
బాలాత్రిపురసుందరి మూలమంత్రము
ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం
శ్రీశైలం దేవస్థానములో అమ్మవారు బృంగి వాహనంపై శైలపుత్రి రూపంలో అలంకరిస్తారు. రెండు అవతారల పరమార్థము ఒక్కటే. ఈ రోజు 9 సంవత్సరాలలోపు బాలికచే కుమారి పూజ చేయిస్తారు.
ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది. అమ్మవారిని ఆకుపచ్చ రంగు వస్త్రములతో అలంకరించి, గులాబీలతో అర్చిస్తే శుభప్రదము.
బాలాత్రిపురసుందరి మరియు శైలపుత్రి రూపంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి, తల్లి కరుణాకటాక్ష వీక్షణకు పాత్రులగుదాం.
శుభం భూయాత్!!
డా. దేవులపల్లి పద్మజ
విశాఖపట్టణము