Jeddah | నెల రోజుల కాల్పుల విరమణకు జెలెన్ స్కీ అంగీకారం..

జెడ్డా : రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య మూడు సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు దశకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈక్రమంలోనే సౌదీ అరేబియాలోని జెడ్డాలో ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్ ఆధ్వర్యంలో అమెరికా మంత్రులు, అధికారుల బృందం, ఉక్రెయిన్‌ ప్రతినిధుల బృందం మధ్య గ‌త రాత్రి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో 30రోజుల సాధారణ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ప్రతిపాదించగా, అందుకు కీవ్‌ అంగీకారం తెలిపింది. ఈనేపథ్యంలో సైనిక సాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. ఇక ఖనిజాల తవ్వకానికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి వచ్చేందుకు రెండు దేశాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై రష్యాతో అమెరికా చర్చలు జరపాల్సి ఉంది. ఇక, రష్యా దీన్ని అంగీకరించాల్సి ఉంది.

కాగా, రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ఆపేందుకు ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై చర్చించేందుకు ఇటీవల శ్వేతసౌధంలో జెలెన్‌స్కీ, ట్రంప్‌లు భేటీ కాగా.. వీరి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం శాంతి సాధనకు అవసరమైన చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈక్రమంలోనే సౌదీ అరేబియాలోని జెడ్డాలో ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్ ఆధ్వర్యంలో గ‌త రాత్రి అమెరికా మంత్రులు, అధికారుల బృందం, ఉక్రెయిన్‌ ప్రతినిధుల బృందం మధ్య చర్చలు ఫ‌ల‌ప్ర‌ద‌మ‌య్యాయి.

కాల్పుల విర‌మ‌ణ‌కు ఉక్రెయిన్ అంగీక‌రించిన అనంత‌రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ… ఇప్పుడు బంతి ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ కోర్టులో ఉంద‌న్నారు.. ఆయ‌న కూడా ఈ శాంతి ఒప్పందానికి ఒప్పుకుంటార‌నే ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా అనేక మంది ప్రజలు చనిపోతున్నారు. ఈ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నా. అందులో భాగంగా కాల్పుల విరమణ చాలా ముఖ్యం. దీనిపై నేను పుతిన్‌తో మాట్లాడతాను. వాళ్లు దీనికి ఒప్పుకోకపోతే ఇంకా అనేక మంది ప్రజలు చనిపోతారని ట్రంప్ పేర్కొన్నారు. ఇక, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తో మరోసారి చర్చలు జరిపేందుకు ఆయన్ను త్వరలోనే వైట్‌హౌస్‌కు ఆహ్వానిస్తానని ట్రంప్‌ తెలిపారు. అనంతరం శాంతి సాధనకు అవసరమైన చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *