మాజీ మంత్రి జోగి రమేష్‌పై వైసీపీ వేటు వేయాలి

మాజీ మంత్రి జోగి రమేష్‌పై వైసీపీ వేటు వేయాలి

ఆంధ్ర ప్రదేశ్ స్వచ్ఛాంధ్ర‌ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ డిమాండ్

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ ను వైసీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ స్వచ్ఛాంధ్ర‌ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరులో పర్యటించిన ఆయన మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ జోగి రమేష్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసి జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో కల్తీ మద్యం వెలుగులోకి రావడంతో తమ పార్టీ నేత జయచంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

జగన్ కు జోగి రమేష్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసే దమ్ము ఉందా అని సవాల్ చేశారు. వైసిపి పాలనలో కల్తీ మద్యం తయారుచేసి వందల కోట్ల దోచుకున్న మద్యం మాఫియా తిరిగి కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కల్తీ మద్యం తయారీని ప్రారంభించినట్లు తెలిపారు. మొత్తం కుట్ర జోగి రమేష్ ఆధ్వర్యంలో జరిగిందని అందుకు తగిన ఆధారాలతో ఆదివారం జోగి రమేష్ ను అరెస్టు చేయడం జరిగిందన్నారు. తంబళ్లపల్లి మద్యం కేసులో నిందితులు స్పష్టంగా జోగి రమేష్ ప్రేరణతోనే మద్యం తయారు చేసినట్లు అంగీకరించారని తెలిపారు. మద్యం నిందితులకు జోగి రమేష్ కు జరిగిన వాట్స్అప్ చాట్ బయటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ చాట్లో ఆఫ్రికా ఎప్పుడు వెళుతున్నారు ఎప్పుడు తిరిగి వస్తావు అన్న విషయాలు ఉందా లేదా అని ఆయన ప్రశ్నించారు. అన్ని ఆధారాలతో రమేష్ అరెస్టు చేయగా జగన్మోహన్ రెడ్డి కుట్ర అని ఆరోపిస్తున్నారని తెలిపారు.

జోగి రమేష్ పార్టీ నుండి సస్పెండ్ చేసి జగన్మోహన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కొమ్మునేని పట్టాభిరాం డిమాండ్ చేశారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర గురించి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి దశ దిశ నిర్దేశంలో గత 11 నెలల నుండి ఆంధ్ర ప్రదేశ్ లో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ద్వారా చెత్త సేకరణ, నిర్వహణ, పారిశుధ్యం పై పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రతి మూడవ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రంలో నలుమూలలా పర్యటించి పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రోజు చెత్త సేకరణ నిర్వహిస్తున్నామని, ఏ రోజు చెత్త ఆ రోజు సేకరించి ప్రాసెస్ చేసి తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చెత్త కుండీ లేని రాష్ట్రం గా ఆవిష్కరించాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 85లక్షల టన్నుల చెత్త ను తొలగించకపోగా పన్ను కూడా విధించారన్నారు. ఇందులో చిత్తూరు పట్టణంలో 15 ఎకరాలలో సుమారు 1.5 లక్షల టన్నుల చెత్తను విడిచిపెట్టారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ చెత్తను తొలగించడంలో భాగంగారూ.13 కోట్లు ఖర్చు చేస్తున్నదని, సిగ్మా సంస్థ ద్వారా ప్రక్రియ మొదలు పెట్టిందని, బయో మైనింగ్ చేస్తున్నారని, అనంతరం ప్రాసెస్ చేసి డిసెంబర్ 31 లోపు చెత్త తొలగిస్తారన్నారు. చెత్త ఉన్న 15 ఎకరాల స్థలం లో ఏ పి గ్రీనర్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ తో సమన్వయం చేసుకుని వచ్చే వేసవి లోపు అందమైన పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు.

చెత్త కుండీ లేని రాష్ట్రం ఏర్పాటు దిశగా..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 11 నెలల నుండి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని నిరహించుకుంటున్నామని ఆంధ్ర ప్రదేశ్ స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కే.పట్టాభిరామ్ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు పట్టణం లోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లాలో చేపట్టిన పారిశుధ్య నిర్వహణ, వేస్ట్ మేనేజ్మెంట్ పై మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో చిత్తూరు ఎం ఎల్ ఏ గురజాల జగన్మోహన్, నగరపాలక మేయర్ అముద, చుడా చైర్మన్ హేమలత, ఎక్స్ ఎం ఎల్ సి రాజసింహులు, ముదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, ఏ ఎం సి చైర్మన్ వెంకటేష్, నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ చిత్తూరు పట్టణానికి 50 డివిజన్ లకు 50 ఎలెక్ట్రిక్ వాహనాలను అందించి ఇంటింటి చెత్త సేకరణ చేపడతామన్నారు. చెత్త సేకరణకు గ్రామీణ ప్రాంతాలలో తోపుడు బండ్లను అందించామని, అవసరం మేరకు పట్టణ ప్రాంతాల్లో కూడా అందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛరథం పేరుతో గృహాలలోని చెత్త నుండి వేరు చేసిన పొడి చెత్తను ప్రభుత్వం సేకరిస్తుందని, అందుకు తగిన విధంగా నిత్యావసర సరుకులను అందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని 100 మండలాల్లో నిర్వహించుటకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. నమస్తే స్కీమ్ కింద ఒక యాప్ క్రియేట్ చేసి ఇంటి వద్ద చెత్త సేకరించి స్క్రాప్ డీలర్ లు, వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నియమ నిబంధాలను అనుసరించి రీసైక్లింగ్ యూనిట్లకు అందజేయడం జరుగుతుందని, దీనికి తగిన ధర చెల్లించడం జరుగుతుందన్నారు.

Leave a Reply