ఆస్తి కోసం కూతురినే చంపేశారు

మూడేళ్ల తర్వాత వెలుగులోకి ఘటన

  • బీటెక్ విద్యార్థి సజీవ దహనం కేసులో కీలక మలుపు
  • అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు అప్పట్లో కేసు నమోదు
  • ఫోరెన్సిక్ రిపోర్టులో విస్తు గొలిపే వాస్తవాలు
  • తండ్రితోపాటు సవతి తల్లి అరెస్టు, రిమాండ్‌కు తరలింపు

తణుకు, ఆంధ్రప్రభ: ఆస్తి కోసం కన్న కూతురునే చంపేసిన (killed its own daughter) ఘటన మూడేళ్ల అనంతరం వెలుగు చూసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చ‌నిపోయినట్లు గతంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే తాజాగా వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్టులో విస్తు గొలిపే వాస్తవాలు వెలుగు చూడ‌టంతో పోలీసులను సైతం విస్మయానికి గురి చేశాయి. తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. గ్రామానికి చెందిన ముళ్ళపూడి నాగ హారిక (19) తాడేపల్లిగూడెం ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. 2022 నవంబరు 12వ తేదీన ఉదయం లేచి చూసేసరికి హారిక తన పడక గదిలో మంచంపై సజీవ దహనమై ఉంది. అయితే సెల్‌ఫోన్‌ చార్జర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెల‌రేగి ఆమె మృతి చెందినట్లుగా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో తణుకు రూరల్ ఎస్సై రాజకుమార్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే హారిక ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారంటూ అప్పట్లో మేనమామ, అమ్మమ్మ ఆరోపించారు.

ఆస్తి కోసం దారుణం
తణుకు మండలం ముద్దాపురం గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్ మొదటి భార్య గజ్జరపు వసంత కుమార్తె నాగ హారిక కాగా, 2003లో వసంత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతరం 2009లో ముద్దాపురం గ్రామానికి చెందిన ముళ్లపూడి రూపను శ్రీనివాస్ వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె జన్మించింది. ఇదిలా ఉంటే మొదటి భార్య కుమార్తె నాగ హారిక పేరున ఎకరం పొలం ఆస్తి ఉంది. మరోవైపు తల్లి వసంత మృతి చెందిన తర్వాత ఆమె ద్వారా సంక్రమించిన మరో మూడు ఎకరాలు నాగ హారికకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే నాగ హారికకు సంక్రమించే ఆస్తిపై కన్నేసిన సవతి తల్లి ముళ్ళపూడి రూప ఆమెను హత్య చేయాలని పథకం పన్నారు. ఇందుకోసం భర్త శ్రీనివాస్ సైతం సహకరించాడు. 2022 నవంబర్ 11వ తేదీ రాత్రి నాగ హారిక నిద్రించిన తర్వాత ఆమె తలపై కొట్టి హత్య చేసి అనంతరం మంచంపైనే పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. తెల్లారేసరికి ఏమీ తెలియనట్లు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటి సీఐ ఆంజనేయులు, రూరల్ ఎస్సై రాజకుమార్ ఘటనా స్థలానికి చేరుకొని షార్ట్ సర్క్యూట్ కారణంగానే మృతి చెందినట్లు నిర్ధారించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది అయితే నాగ హారికను ఉద్దేశపూర్వకంగానే సవతి తల్లి హత్య చేసినట్లు అప్పట్లోనే మేనమామ, అమ్మమ్మ ఆరోపించారు. వీరి ఆరోపణలను పరిగణనలోకి తీసుకొని పోలీసులు గ్రామ వీఆర్వో వద్ద ఫిర్యాదు తీసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

అప్పటి పోలీసుల తీరుపై ఆరోపణలు
గతంలో తణుకు వైసీపీ మండలం అధ్యక్షురాలిగా పనిచేసిన ముళ్ళపూడి రూప తన పలుకుబడిని ఉపయోగించి పోలీసులను సైతం తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. వైయస్సార్సీపీ (YSRCP)లోని కొందరు పెద్దలు సహకారంతో ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో అప్పటి సీఐ ఆంజనేయులు కీలకపాత్ర పోషించినట్లు విశ్వసనీయ సమాచారం. మరో వైపు మృతురాలు నాగ హారిక కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకోవాల్సి ఉండగా, గ్రామ విఆర్వో నుంచి ఫిర్యాదు తీసుకోవడం అప్పట్లోనే విమర్శలకు దారితీసింది. మరోవైపు ఫోరెన్సిక్ రిపోర్టు రావడానికి సైతం మూడేళ్లు సమయం పట్టడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి కేసుల్లో గరిష్టంగా మూడు నెలల్లోనే ఫోరెన్సిక్ రిపోర్టు వ‌స్తాయి. అయితే ఈ కేసులో మాత్రం మూడేళ్ల తర్వాత కరెన్సీకి రిపోర్టు రావడం అందులోని అంశాల ఆధారంగా చేసుకుని అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన సెక్షన్లను మార్పు చేసి… హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుత సీఐ కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో చంద్రశేఖర్ కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. తండ్రి ముళ్ళపూడి శ్రీనివాస్ తోపాటు సవతి తల్లి ముళ్ళపూడి రూపాలను అరెస్టు చేసి బుధవారం రిమాండ్ కు తరలించారు.

Leave a Reply