కనకదుర్గమ్మ దర్శనానికి యువ బైకర్ తాప్సీ

కనకదుర్గమ్మ దర్శనానికి యువ బైకర్ తాప్సీ
మిషన్ హెల్తీ భారత్’ యాత్రకు ఆధ్యాత్మిక శక్తి
ఊబకాయం నిర్మూలన లక్ష్యంతో దేశవ్యాప్తంగా బుల్లెట్‌పై యాత్ర..
ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా ఒబెసిటీ ముక్త్ భారత్ – మిషన్ హెల్తీ భారత్” నినాదంతో బైక్ యాత్ర కొనసాగిస్తున్న యువ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ను శుక్రవారం దర్శించుకున్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా దేశంలో పెరుగుతున్న ఊబకాయం పై అవగాహన కల్పించేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై ఆమె చేపట్టిన ఈ యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. యాత్రలో భాగంగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఆధ్యాత్మికతతో పాటు సామాజిక చైతన్యాన్ని పెంపొందించడం తన లక్ష్యమని ఆమె తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న తాప్సీ ఉపాధ్యాయకు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆమెను శాలువాతో సత్కరించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ, కనకదుర్గమ్మను దర్శించుకోవడం తనకు అపారమైన మానసిక ప్రశాంతతను, శక్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. యువ వయస్సులో సామాజిక బాధ్యతతో ఆమె చేపట్టిన ఈ సాహస యాత్రను ఆలయ అధికారులు, భక్తులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
