పడిపోయాం.. బస్సు వచ్చింది.. బై కర్ ఫ్రెండ్ వాంగ్మూలం
(కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో ) : కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదం వెనుక అసలు సన్నివేశం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బైక్ నడుపుతూ మృతి చెందిన ప్రజా నగర్ కాలనీ చెందిన శివశంకర్ తో పాటు ఉన్న వ్యక్తి ఎర్రిస్వామి అలియాస్ నానిగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ (SP Vikrant Patil) తెలిపారు.
అర్ధరాత్రి ప్రయాణమే విషాదానికి దారితీసింది..
దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరూ లక్ష్మీపురం గ్రామం నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత ప్రయాణమయ్యారు. ఎర్రిస్వామిని అతని ఊరైన తుగ్గలి వద్ద వదలడానికి శివశంకర్ స్వయంగా తన పల్సర్ బైక్‌పై బయలుదేరాడు. వీరు కియా షోరూం (Kia Showroom) సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రాత్రి 2.24 గంటలకు రూ.300 పెట్రోల్ పోసుకుని తిరిగి ప్రయాణం కొనసాగించారు. కొద్ది దూరం వెళ్లకముందే, చిన్న టేకూరు వద్ద రహదారిపై బైక్ స్కిడ్ అయి, రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఢీ కొట్టింది.
ప్రాణాలతో ఎర్రి స్వామి పరారీ..
దురదృష్టవశాత్తు బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే శివశంకర్‌ను రోడ్డుమధ్య నుంచి బయటకు లాగి, శ్వాస పరిశీలించిన ఎర్రిస్వామి అప్పటికే అతను మృతి చెందాడని నిర్ధారించుకున్నాడు. బైక్‌ను రోడ్డు పక్కకు తీసివేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే వెనుక నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు వేగంగా ఢీ కొట్టి, బైక్‌ను కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది.
ఢీకొన్న బస్సు క్రింద మంటలు చెలరేగడంతో ఎర్రిస్వామి అక్కడి నుంచి తప్పించుకుని తన గ్రామం తుగ్గలి వైపు వెళ్లిపోయాడు. ఈ ప్రమాద ఘటనపై ఉలిందకొండ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. సంఘటన స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజీలు, బస్సు డ్రైవర్ వాంగ్మూలం, ఎర్రిస్వామి వివరాలతో పలు కోణాల్లో పరిశీలిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో బైక్ ప్రమాదం అనంతరంగానే బస్సు ఢీ కొట్టినట్లు తేలింది. అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది అని ఎస్పీ లస్పష్టం చేశారు.

