Yedapally | వారణాసిలో తెలంగాణ కళావైభవం…

Yedapally | వారణాసిలో తెలంగాణ కళావైభవం…
- పేరిణి సతీష్ బృందం అద్భుత ప్రదర్శన
Yedapally | ఎడపల్లి, ఆంధ్రప్రభ : కాశీ మ్యూజిక్ అండ్ డాన్స్ ఉత్సవ్ 2025లో భాగంగా, శ్రీ సాయి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ పేరిణి నాట్యకారుడు పేరిణి సతీష్, అతని బృందం ప్రదర్శించిన అద్భుతమైన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సతీష్ బృందం పేరిణి నాట్యం శివయ్య సేవలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, కళా వైభవాన్ని ప్రతిబింబిస్తూ, కళాకారులు ప్రదర్శించిన వీరనృత్యం పేరిణి భక్తజనాన్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తింది.
చారిత్రక ప్రాధాన్యత కలిగిన పేరిణి నాట్యాన్ని వారణాసిలో వేదికపై ప్రదర్శించడం పట్ల భక్తులు, కళాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా కాశీ మ్యూజిక్ అండ్ డాన్స్ ఉత్సవ్ 2025 లో భాగంగా నిర్వహించిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో నిజామాబాద్, ఎడపల్లి మండలంలోని జంకంపేట గ్రామం నుండి వచ్చిన పేరిణి సతీష్ బృందం ప్రదర్శన, తెలంగాణ కళకు దక్కిన గౌరవంగా నిలిచింది. శ్రీ సాయి నటరాజ ఆర్ట్స్ అకాడమీ, ఆర్టిస్ట్ ఫ్యాక్టరీ వైజాగ్ సభ్యులు ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించింది.

ఈసందర్భంగా శ్రీ సాయి నటరాజ ఆర్ట్స్ అకాడమీ సభ్యులు మాట్లాడుతూ… కాశీ మ్యూజిక్ అండ్ డాన్స్ ఉత్సవ్ భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల కళాకారులను, సంస్కృతులను ప్రోత్సహిస్తున్నామని, పేరిణి సతీష్ బృందం ప్రదర్శన కళాత్మకంగా, ఆధ్యాత్మికంగా అత్యంత వైభవంగా జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ నుండి వచ్చి, వారణాసిలో శివయ్య చెంత తమ కళను ప్రదర్శించిన సతీష్ బృందానికి ఆలయ అధికారులు, స్థానిక ప్రముఖులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మేరకు వారిని శాలువాలతో మెమోంటోలతో సత్కరించారు.
