WTC Final | తొలి రోజే బౌలర్ల హవా… పై చేయి సాధించిన ఆసీస్ !

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మొదటి రోజే క్రికెట్ అభిమానులకు ఉత్కంఠ కలిగించింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ కీలక మ్యాచ్ తొలి రోజు పూర్తిగా బౌలర్లదే హవా కొనసాగింది. దీంతో 212 ప‌రుగులకు ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా.. త‌మ‌ బౌలింగ్ తో తిరిగి ఆధిక్యం సాధించింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా:

టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంపా బవూమా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం పూర్తిగా సరైనదిగా నిరూపితమైంది. సహజంగా స్వింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై సఫారీ బౌలర్లు అదిరిపోయే ప్రదర్శన చేశారు.

స్టీవ్ స్మిత్, వెబ్‌స్టర్ పోరాటం..

ఆస్ట్రేలియా తొలి సెషన్‌లోనే 67/4 వద్ద కష్టాల్లో పడింది. అయితే స్టీవ్ స్మిత్ (66) – బ్యూ వెబ్‌స్టర్ (72) మధ్య వచ్చిన 79 పరుగుల భాగస్వామ్యం ఆసీస్‌ను కొంతవరకు నిలబెట్టింది. కెరీ (23) కూడా ఒక దశలో మద్దతుగా కనిపించినా, టీ విరామం తర్వాత ఆసీస్ 212 పరుగులకు ఆలౌట్ అయింది.

సఫారీలకు స్టార్క్ బౌలింగ్ ఝలక్…

తక్కువ ఓవర్లలో చిన్న లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశ్యంతో మైదానంలోకి దిగిన దక్షిణాఫ్రికాకు తొలి ఓవర్లోనే షాక్ త‌గిలింది. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఐడెన్ మార్కరం డకౌట్ అయ్యాడు. అనంతరం మరో ఓపెనర్ ర్యాన్ రికెల్ట‌న్ (16) కూడా పెవిలియన్ చేరాడు.

దీంతో డ్రింక్స్ బ్రేక్ సమయానికి 11 ఓవర్లలో 19/2 గా నిలిచింది సఫారీ జట్టు. ఆ తర్వాత హాజిల్ వుడ్, ప్యాట్ కమ్మిన్స్ తల తాలుగా వికెట్లు తీసి జట్టును దెబ్బతీశారు. వీరి దెబ్బ‌కు వియాన్ ముల్డర్ (6), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (2) స్వ‌ల్ప ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరారు.

స్టంప్స్ సమయానికి పరిస్థితి

ఇక‌ రోజు ముగిసే సమయానికి సౌతాఫ్రికా 22 ఓవర్లలో 43/4 వద్ద నిలిచింది. కెప్టెన్ బవూమా (3), బెడింగ్హామ్ (8) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 169 పరుగుల వెనుకంజలో ఉంది.

Leave a Reply