డబ్ల్యూపీఎల్-2025 లీగ్ దశ పోటీలు ముగిశాయి. ఇప్పుడు ప్లే ఆఫ్స్ పోరుకు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో టాప్-3లో నిలిచిన జట్లు నాకౌట్ దూసుకెళ్లాయి. మిగతా రెండు జట్లు డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, యూపీ వారియర్స్ జట్లు ఇంటి బాట పట్టాయి.
ఇక అగ్ర స్థానంలో నిలిచిన ఢిల్లి క్యాపిటల్స్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించగా… రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య నేడు (గురువారం) ఎలిమినేటర్ పోరు జరుగనుంది. కాగా, నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ జేయింట్స్… బౌలింగ్ ఎంచుకుని ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
ఇక నేటి మ్యాచ్ లో గెలిచే జట్టు శనివారం జరిగే టైటిల్ పోరులో ఢిల్లితో అమీతుమీ తేల్చుకుంటుంది. కాగా, నేటి బిగ్ ఫైట్‌లో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్‌పై ముంబై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు జరుగగా.. అన్ని మ్యాచుల్లోనూ ముంబై జట్టే విజయాలు సాధించింది. ఈ ఏడిషన్లోనూ ఇరు జట్లు రెండు సార్లు ముఖాముఖీగా తలపడగా.. అందులోనూ ముంబై జట్టే గెలుపొందింది.
ఈసారి కూడా గుజరాత్‌ను ఓడించి ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలని హర్మన్ సేన చూస్తోంది. మరోవైపు కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్ కూడా గెలుపే లక్ష్యంగా మైదానంలో అడుగుపెట్టనుంది. పటిష్టమైన ముంబైకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
జట్టు మార్పులు:
రెండు జట్లు ఒక్కొక్క మార్పు చేశాయి.
గుజరాత్ జెయింట్స్ ఉమెన్ : చివరి నిమిషంలో గాయం కారణంగా వైదొలిగిన వరల్డ్ బాస్ డయాండ్రా డాటిన్ స్థానంలో ఇంగ్లీష్ ఆల్ రౌండర్ డేనియల్ గిబ్సన్ తుది జట్టులోకి వచ్చింది. అయితే, WPLలో డేనియల్ గిబ్సన్ అరంగేట్ర మ్యాచ్ ఆడనుంది.
ముంబై ఇండియన్స్ మహిళలు: పరుణికా సిసోడియా స్థానంలో సైకా ఇషాక్ తుది జట్టులోకి వచ్చింది.
ఫైనల్ జట్లు :
గుజరాత్ జెయింట్స్ మహిళలు : బెత్ మూనీ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డ్నర్ (కెప్టెన్), డేనియల్ గిబ్సన్, కష్వీ గౌతమ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, భారతి ఫుల్మాలి, సిమ్రాన్ షేక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్, ప్రియా మిశ్రా.
ముంబై ఇండియన్స్ మహిళలు : హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, అమేలియా కెర్, నాట్ స్కీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమంజోత్ కౌర్, యాస్టికా భాటియా (వికెట్ కీపర్), సజీవన్ సజన, సైకా ఇషాక్, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్.