world cup |పాక్‌కు ఐసీసీ వార్నింగ్‌

world cup |పాక్‌కు ఐసీసీ వార్నింగ్‌

  • బంగ్లాదేశ్​ను ఫాలో అయ్యే ఆలోచనలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు!
  • బంగ్లాకు మ‌ద్ద‌తుగా పాకిస్థాన్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ వ్యాఖ్య‌లు
  • పీసీబీ ఛైర్మన్ వైఖరిపై ఐసీసీ తీవ్ర అసంతృప్తి
  • టీ20 వరల్డ్​కప్ ఆడ‌కుంటే క‌ఠిన చ‌ర్య‌లు
  • పాక్​పై ఆంక్షలకు ఐసీసీ రెడీ!

world cup |వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : టీ20 వరల్డ్​కప్ 2026 మొద‌లవ్వ‌క‌ముందే ప‌లు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. భ‌ద్ర‌తా కార‌ణాల‌తో భార‌త్‌లో ఆడ‌మ‌ని బంగ్లాదేశ్ మొడికేయ‌డంతో… ఐసీసీ ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకొని ఆ జ‌ట్టును టోర్నీ నుంచే తీసేసింది. ఆ జ‌ట్టు ప్లేస్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ ఇచ్చింది. దీనిపై పాకిస్థాన్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. బంగ్లాదేశ్‌ విషయంలో ఐసీసీ పక్షపాత నిర్ణయాలు తీసుకుంటుందని నఖ్వీ ఆరోపించారు. అయితే టోర్నీ నుంచి బంగ్లాను తప్పించడంతో పాకిస్థాన్ కూడా ఈ వరల్డ్​కప్​ను బాయ్​కట్ చేయాలని ఆలోచిస్తుందనే ప్ర‌చారం సాగుతోంది. ఒకవేళ పాకిస్థాన్ గనుక ఆ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఐసీసీ దీనిని వెరీ సీరియస్​గా తీసుకోనుందని తెలుస్తోంది. అందుకు పాక్​పై గ‌ట్టిగా యాక్ష‌న్ తీసుకునే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

పీసీబీ ఛైర్మన్, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహ్సిన్ నఖ్వీ ఏమ‌న్నాడంటే.. గతంలో పాకిస్థాన్ మ్యాచ్‌ల కోసం హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించిన ఐసీసీ, ఇప్పుడు బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించడానికి నిరాకరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది ఐసీసీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని నఖ్వీ ఆరోపించారు.

పీసీబీ ఛైర్మన్ నఖ్వీ వైఖరిపై ఐసీసీ తీవ్ర అసంతృప్తితో ఉంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)తో కలిసి ఐసీసీపై ఒత్తిడి తీసుకురావాలని చూడటం, ప్రపంచకప్‌ నుంచి వైదొలుగుతామని బహిరంగంగా సవాల్ చేయడాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. ఒకవేళ పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి నిజంగానే వైదొలగితే, గతంలో ఎన్నడూ లేని విధంగా కఠిన చర్యలు తీసుకోవడానికి ఐసీసీ సిద్ధమైనట్లు సమాచారం.

ఈ ప్రపంచకప్​లో పాకిస్థాన్ పాల్గొనకుండా నిర్ణయం తీసుకుంటే, ఆ జట్టు ఇతర దేశాలతో ఆడే ద్వైపాక్షిక సిరీస్​లు రద్దు చేయాలన్న ఆలోచనలో ఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమ దేశవాళీ టోర్నమెంట్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడేందుకు ఫారిన్ ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నిరాకరిస్తుందట. వీటితోపాటుగా ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్ టోర్నమెంట్​లో పాల్గొనకుండా పాకిస్థాన్​ను బహిష్కరించేందుకు కూడా సిద్ధమైందని క్రీడా వర్గాల సమాచారం.

వివాదం ఏమిటంటే..?
బంగ్లాదేశ్​లో హిందువులపై జరిగిన దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్​పై 2026 ఐపీఎల్ సీజన్​లో​ ఆడకుండా వేటు పడింది. బీసీసీఐ సూచనతో అతడిని కేకేఆర్ ఫ్రాంచైజీ తమ జట్టు నుంచి​ తొలగించింది. దీంతో భద్రత కారణాలు సాకుగా చూపిస్తూ, భారత్​లో వరల్డ్​కప్ ఆడేందుకు నిరాకరించింది. తమ మ్యాచ్​లు శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే బంగ్లా విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. బంగ్లాను టోర్నీ నుంచి బహిష్కరించి ఆ స్థానంలో స్కాట్లాండ్​కు అవకాశం కల్పించింది.

Leave a Reply