కామ్రేడ్ సీతక్క!
పోరాటంలో.. పరిపాలనలో మొండిఘటం
ఓపెన్ బుక్ సీతక్క జీవితం
ఈ తరానికి స్ఫూర్తిదాయం
అడవి బిడ్డగా మొదలైన ప్రస్థానం
అడవి నుంచి అడవిలోకి పయనం
జైల్లోనే అక్షరమై మొలకెత్తిన అంకురం
ఉన్నత చదువుల దిశగా పయనం
జన జీవనం నుంచి ప్రజా ప్రభుత్వంలోకి
పవర్ ఫుల్ లీడర్ మంత్రి సీతక్క
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
పేదవాడి గుండెచప్పుడు నుంచి పుట్టుకొచ్చిన మహిళ అని అనడంలో సందేహం లేదు. పోరాటమైనా.. పాలనలోనైనా.. ఆమె స్టైల్ వేరు. పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన ఆమె జనజీవన స్రవంతిలో చేరి మంత్రి స్థాయికి ఎదగడం సామాన్య విషయం కాదు. గన్ వదిలి పెన్ పట్టుకుని… మంత్రి పదవి చేపట్టారు. ఆమె జీవితం ఒక పుస్తకం లాంటిది. అయినా ఆమె ఇంకా చదువుతూ నిరంతర విద్యార్థిగా ఉంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం ఆమె సహజం. అందుకే ప్రజాదరణ పొందుతున్నారు. ఆమె ఎవరో కాదు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ. ఆమె ప్రజలు ముద్దుగా పిలుచుకునే పేరు సీతక్క. అత్యంత ప్రభావవంతమైన మహిళా నేత, ప్రతిభావంతురాలైన లీడర్, పవర్ఫుల్ వుమెన్ పర్సనాలిటీగా తెలంగాణ వుమెన్ ఐకన్ గా రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి సీతక్క తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఒకసారి సీతక్క ప్రస్థానం తెలుసుకుందాం…
పేదలకు సీతక్క అంటే ధైర్యం..
సేవాగుణం, చొరవ, మానవత్వం, మనోధైర్యం, పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు.. ఇవన్నీ కలబోస్తే తయారయ్యే నిండు మనిషి మంత్రి సీతక్క. సామాన్యులకు సీతక్క అనే పేరు వింటే ఎక్కడలేని ధైర్యం వస్తుంది. అక్క చెవిలో విషయం పడితేచాలు ఇక సమస్య తీరినట్టే అని నిబ్బరం తెప్పించే లా పేరు మారిందంటే అతిశయోక్తికాదు. రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేకపోయినా, అణగారిన వర్గాల నుంచి వచ్చిన సీతక్క తనను తాను ప్రజాజీవితంలో మలచుకున్న తీరు అందిరిని అబ్బుర పరుస్తోంది. మంత్రి సీతక్క ఎక్కడికెళ్లినా తండోపతండాలుగా సామాన్యులు వచ్చి తమ గోడును వెల్లబుచ్చుకుంటారు. అన్ని ఓపికగా వింటూ… ప్రతి ఒక్కరీ సమస్య వింటూ వాటిని పరిష్కరించడానికి చర్యలు చేపడుతుంటారు. అందుకే సీతక్కకు ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది.
ఎన్నో మలుపులు..
ఆమె జీవితం ఎన్నో మలుపులు తిరిగాయి. అడవుల్లో అన్నలతో ఉంటూ ప్రజాపోరాటాలు చేశారు. గన్ పట్టుకుని సాయుధ పోరాటానికి కూడా వెనుకడని మహిళ. గన్‌తో పేదవాడికి న్యాయం చేయలేనన్న భావనతోనే జనజీవన స్రవంతిలో చేరి పెన్ పట్టుకున్నారు. చదువుకున్నారు… రాజకీయాల్లో చేరారు… రాణించారు… ఇప్పుడు మంత్రి అయ్యారు… ఆమె మన సీతక్క
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం..
తెలంగాణ నలుమూలలా కాళ్లకు చక్రాలు కట్టుకుని సమస్య ఏమున్నా వాలిపోయే జననేతగా అక్క పేరుప్రతిష్ఠలు మారుమోగేలా సీతక్క ఎదిగారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారపక్షంలో ఉన్నా సీతక్క సీతక్కే అంటారు ప్రజలు! ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేసే సిసలైన ఉక్కు మహిళగా సీతక్క పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. కార్యసాధకురాలిగా, చిత్తశుద్ధితో మెరుగైన పాలనా దక్షతను ప్రదర్శిస్తున్న ఆమె ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆమె గొప్పతనాన్ని చెబుతుంది. అధికారులైనా, ప్రజలైనా అక్కా అంటే చాలు తక్షణం స్పందించే గుణం ఉన్న మహిళా నేతగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. క్షణం తీరిక లేని ప్రజా జీవితంలో కూడా నిత్య విద్యార్థిగా ఏదో ఒక కోర్సు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచే సీతక్క వ్యక్తిగత జీవితమంతా పోరాటాలమయం. సమస్యలకు వెన్ను చూపకుండా వాటిపై పోరాడే సామాన్య మహిళ… సీతక్క!