• మ‌హిళా క్రికెట‌ర్ల‌ను ఆద‌ర్శంగా తీసుకోవాలి
  • కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం,నవంబర్ : బాలిక‌లు ప్రపంచ కప్పు గెలుచుకున్న మహిళా క్రికెట్ టీం ను స్ఫూర్తిగా తీసుకోవాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో బుధవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు సుడిగాలి పర్యటన చేశారు. నగరంలోని మహిళా జూనియర్ కళాశాలలో కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సి.ఎస్.ఆర్ నిధులు 99 లక్షలతో.. నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో ప్రారంభించారు. ఐదు తరగతి గదులను కలియతిరిగారు. నాణ్యతతో కూడిన గదులను 7 నెలల్లో పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. అనంతరం శ్రీకాకుళం మండలం కళ్లేపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు 2కోట్ల అరవై లక్షలతో నిర్మించిన ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆసుపత్రిలో గదులను ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రారంభించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేస్తారు.

అంతకుముందు శ్రీకాకుళం మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి.. వేదికను ఉద్దేశించి మాట్లాడారు. తన తల్లి చదివిన కళాశాల ఇది అని.. ఇలాంటి కళాశాలకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని గత మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోనే స్పష్టం చేసినట్టు తెలిపారు. ఆ హామీకి అనుగుణంగానే ఈ కళాశాల అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిపారు. 1300 వందల మంది విద్యార్థులు గల ఈ కళాశాల రాష్ట్రంలోనే 3వ అతి పెద్దది అని గుర్తు చేశారు. ఈ స్థాయి వైభవం ఉన్నా.. వసతుల లేమి తనను కలవరపెట్టిందని తెలిపారు. విద్యార్థులకు సరిపడా భవనాలు లేక ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డారని, ఇకపై ఆ సమస్య ఉండదని తెలిపారు. ఇప్పటికే 99 లక్షల వ్యయంతో అయిదు గదులతో నిర్మించిన అదనపు భవనంతో పాటు.. భవిష్యత్ లో కూడా మరిన్ని భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గ్రౌండ్, వ్యాయామ ఉపాధ్యాయ కొరత సమస్యలు కూడా త్వరలోనే తీర్చుతామని హామీ ఇచ్చారు.


శ్రీకాకుళం జిల్లా అభివృద్ది చెందాలి అంటే పరిశ్రమలు, ఇండస్ట్రీతో పాటు సమానంగా యువత విద్య విషయంలో కూడా విశేషంగా ఎదగాలని పిలుపునిచ్చారు. విద్యార్థినిలు ఇంటర్ తర్వాత కూడా ఉన్నత విద్యను కొనసాగించాలని కోరారు. ఇందుకు తోడ్పాటుగా ఓ సోదరుడిగా తానున్నానన్న భరోసాను కేంద్ర మంత్రి ఇచ్చారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగం విప్లవాత్మక మార్పులు సాధిస్తోందని.. పాఠశాలల దత్తత, ప్రత్యేక కరికులం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం.. ఇలా అన్ని విషయాల్లో వృద్ధి సాధిస్తోందని తెలిపారు. క్రికెట్ ప్రపంచకప్ ను సాధించిన ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ ఇచ్చిన స్ఫూర్తితో దేశంలో విద్యార్థినిలు ముందుకు సాగాలని.. అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ సంధర్భంగా అక్కడే కూర్చున్న విద్యార్థులతో కేంద్ర మంత్రి ముచ్చటించారు. అందుతున్న సదుపాయాలు.. కావలసిన మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి.. సభా వేదిక ఎదురుగా తమతో పాటు నేలపై కూర్చొని తమ సాధకబాధకాలు తెలుసుకోవడంతో విద్యార్థినిలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply