- అన్ని రంగాల్లో రాణిస్తున్నారు..!
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్ : మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని, అవకాశమిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (BandiSanjayKumar) అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మోదీ కానుక కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచిత ఎలక్ట్రికల్ ఆటోలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏ ఇంట్లోనైతే మహిళలకు ఇంటి తాళం చెవి అప్పగిస్తారో ఆ ఇల్లు బాగుపడుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) 50 లక్షల 65 వేల కోట్ల రూపాయల దేశ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (NirmalaSitharaman) చేతిలో పెట్టడంవల్లే ఆర్ధిక ప్రగతిలో మన దేశం పరుగులు పెడుతోందన్నారు.
11వ స్థానం నుండి 4వ స్థానానికి చేరుకుందని, దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహిళల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. విదేశాంగ మంత్రిగా తొలిసారి తెలంగాణ చిన్నమ్మ సుష్మస్వరాజ్ కు అవకాశం కల్పిస్తే అద్బుతంగా పనిచేశారన్నారు. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము (DroupadiMurmu) కు రాష్ట్రపతిగా అవకాశమిచ్చారని, ఆర్మీతో సహా త్రివిధ దళాల్లో ఆఫీసర్లుగా మహిళలకు అవకాశం కల్పించిన ఘనత మోదీ కే దక్కిందన్నారు. ఆపరేషన్ సింధూర్ లో మహిళా కమాండెంట్ల పాత్ర మీకు తెలిసిందేనని, కరీంనగర్ జిల్లా పరిపాలనా బాధ్యతలను కలెక్టర్ పమేలా సత్పతి చేతిలో పెట్టినామన్నారు. వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఉపయోగపడే పనులెన్నో చేస్తున్నారన్నారు.