వైద్యం వికటించి మహిళ మృతి..

వికారాబాద్ క్రైం, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ సంఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం దారూర్ మండలం కెరెల్లి గ్రామానికి చెందిన కొత్తకాపు లత (38), భర్త అనంతరెడ్డి, వారం రోజుల క్రితం ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిని సంప్రదించారు. వైద్య పరీక్షల్లో గర్భాశయంలో సమస్య ఉందని వైద్యులు గుర్తించి, అదే ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు.

చికిత్స అనంతరం శనివారం డిశ్చార్జ్ కావాల్సి ఉండగా, ఆకస్మికంగా ఆమె ఆరోగ్యం విషమించి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులను పోలీసులు సమాధానపరిచారు.

సమాచారం అందుకున్న టౌన్ సీఐ రఘుకుమార్ ఘటన స్థలానికి చేరుకుని వైద్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆపరేషన్ అనంతరం మృతికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply