రబీ సీజన్ లో రైతులకు సర్టిఫైడ్ విత్తనాలు అందేనా..!
- మార్కెట్ లో విత్తనాల అమ్మకాలపై నిఘా కరువు
- లూజు విత్తన అమ్మకాలపై అధికారుల చర్యలు శూన్యం
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : వరిపంట సాగు దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక స్థాయిలో ఉన్న తరుణంలో ఖరీఫ్ సీజన్ లో రైతుల అవసరాన్ని ఆసరా చేసుకొని మార్కెట్లో నకిలీ విత్తనాలు వచ్చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది రైతులు వరిసాగు పైనే దృష్టి సారిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు అధికశాతంలో కురవడం వరి సాగు విస్తీర్ణం మరింత పెరగడం దీనికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహకం రైతుబంధు, సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తుండటం తో అధిక శాతం మంది రైతులు వరిపంట కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ క్రమంలో అధిక దిగుబడుల కోసం రైతులు విత్తనాలకోసం మార్కెట్ లో అమ్మే విత్తనాల కోసం ప్రవైట్ డీలర్ల ను ఆశ్రయించడంతో దీనిని అవకాశంగా తీసుకుని కొంతమంది వ్యాపారులు తక్కువ ధరకు మేలైన విత్తనాల పేరు చెప్పి నకిలీ విత్తనాలను అంటగట్టుతున్న సంఘటనలు అనేకం చూస్తున్నాము. రైతులు నకిలీ విత్తనాలను కొనుగోలు చేయకుండా ముందస్తుగా సంబధిత వ్యవసాయ పోలీస్ శాఖ అధికారులు నకిలీ విత్తనాలను విక్రయించే వ్యాపారులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రైతులు కోరుచున్నారు. నాణ్యమైన విత్తనాలు సబ్సిడీపై రైతులకు పంపిణీ చేయాలని, విత్తనాల కొనుగోలు పై అవగాహన కల్పించాలని ఆ దిశగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుకుంటున్నారు.
నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠినచర్యలు
రైతులు సర్టిఫైడ్ చేసిన నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలని, వ్యాపారులు అనుమతులు లేకుండా విత్తనాలు అమ్మిన నకిలీ విత్తనాలను విక్రయించిన కఠినచర్యలు తీసుకుంటామని హుజూర్ నగర్ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు రవి తెలిపారు. రైతులు విత్తనాల కొనుగోలుపై అవగాహన పెంచుకొని ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే నకిలీ విత్తనాలను ముందే గుర్తించొచ్చని, నష్టపోయినా పరిహారం సైతం పొందచ్చన్నారు.
ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసిన విత్తనాలే కాకుండా తమ అవసరాల నిమిత్తం మార్కెట్లో ప్రైవేటు వ్యాపారుల నుండి కొనుగోలు చేసే విత్తనాలు విషయంలో నకిలీల బారిన పడే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు.
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వ్యవసాయ శాఖ అనుమతి పొందిన దుకాణాల్లో మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి. కొన్ని చోట్ల ప్రభుత్వం అనుమతి లేని అనధికార విత్తన వ్యాపారులు తెల్లసంచుల్లో నకిలీ విత్తనాలను విక్రయించే అవకాశం ఉన్నందున వారి సమాచారాన్ని తక్షణమే అధికారులకు తెలియజేయాలి. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చు కున్న సంస్థల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి.
కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి బిల్లు తప్పనిసరిగా తీసుకోవాని, బిల్లుపై రైతు చిరునామా, గడువు తేదీ, విత్తనం ధర, కంపెనీ పేరు, అమ్మినవారి సంతకం తప్పనిసరిగా ఉండేలా జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. విత్తన బస్తాపై ముద్రించిన ధ్రువపత్ర బిల్లు తమ పంట చేతికి వచ్చేవరకూ రైతులు భద్రపరచుకోవాలి. విత్తనాలు కొన్న వెంటనే మొలక శాతం పరీక్షించుకోవాలి. కనీసం 75 శాతం మొలకలుంటేనే వాటిని విత్తనంగా వినియోగిం చుకోవాలి. విత్తన సంచులను రైతుల నమూనా వివరాల కోసం పంట కోతకు వచ్చే వరకూ దాచుకోవాలి.
అనుమతి పొందిన వ్యాపారుల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి
రైతులు అనుమతులున్న వ్యాపారుల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని, ఒకవేళ నకిలీ విత్తనాలతో మోసపోతే వెంటనే వ్యవసాయ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. విత్తనాలు నాణ్యమైనవి కాకపోవడం వల్లే దిగుబడి రాలేదని గుర్తిస్తే సదరు విత్తన కంపెనీపై మండల వ్యవసాయాధికారి ద్వారా జిల్లా వ్యవసాయ సంచాలకులకు ఫిర్యాదు చేసి పరిహారం పొందవచ్చని తెలిపారు.

