తిథి ఏదైనా అన్ని కార్యాలకు మంచిది కాదు, చెడ్డది కాదు. మరి చేసే పనిని బట్టి తిథుల మంచిచెడులు ఉంటాయి. ఆయుధాలతో, వాహనములతో, యంత్రములతో అనగా లోహవస్తువులతో చేసే పనులకు అమావాస్య చాలా మంచిది. అలాగే యుద్ధమునకు, యుద్ధ ప్రయత్నములకు అమావాస్య మంచిది. ‘అమా’ అనేది సూర్య కిరణానికి పేరు. ఆ కిరణంలో చంద్రుడు ఉన్నరోజు అమావాస్య అంటారు. సూర్యుడు, చంద్రుడు కలిసి ఒకే చోట ఉన్నరోజు అమావాస్య, భారత యుద్ధం అమావాస్య నాడు ప్రారంభమైంది. ముహుర్తం పెట్టించుకున్నది దుర్యోధనుడైనా శ్రీ కృష్ణ భగవానుడి కార్యదక్షత వలన పాండవులు ముందుగా ప్రారంభించారు, దుర్యోధనుడు పాడ్యమి నాడు ప్రారంభించాడు.
సౌరమానాన్ని అనుసరించేవాడు శుభకార్యములకు ప్రయత్నాన్ని కూడా అమావాస్య నాడే ప్రారంభిస్తారు. ఆషాడ మాసం మరియు అమావాస్య, చతుర్ధశి వంటి తిథులలో శుభకార్యములను నిర్వహిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించేవారు అమావాస్య నాడు ఎటువంటి శుభకార్యాలను తలపెట్టరు. ఉపాసనలకు, ఆరాధనలకు, తర్పణాలకు, దానాలకు, యజ్ఞాలకు విశేషమైన పూజలకు మాత్రం అమావాస్య యోగ ప్రథమని ఆచరిస్తారు. అమావాస్యకు పితృ తేది అని కూడా పేరు. ఆరోజు శోత్రీయులు తప్పక తిల తర్పణం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో తమ వారు పోయిన తిథి గుర్తు లేకుంటే అమావాస్య నాడు శ్రాద్ధం నిర్వహిస్తారు. మంత్ర దీక్షకు, ఉపాసనకు అమావాస్య చాలా శ్రేష్టమైనది.
అమావాస్య మంచిదని కొందరు, కాదని కొందరు అంటారు ఎందుకు?
