అధికారులు ఎక్కడ..?

అధికారులు ఎక్కడ..?

మోత్కూర్, (ఆంధ్రప్రభ)
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ లో మెయిన్ రోడ్డు విచిత్రంగా మారింది. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టి, నూతన బి టి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు, డివైడర్, బటర్ ఫ్లై లైట్లతో అందంగా తీర్చిదిద్దారు కానీ.. అంబేద్కర్ చౌరస్తా నుండి నార్కెట్ పల్లి రూట్లో మాత్రం డివైడర్, లైటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ, రోడ్డు విస్తరణ పనులు మాత్రం చేపట్టకపోవడంతో.. నిత్యం నార్కెట్ పల్లి, నల్గొండ, చౌటుప్పల్ కి వెళ్లే బస్సులు, భారీ వాహనాలు ఒక రూట్లో వెళ్తున్నప్పుడు ద్వి చక్ర, త్రి చక్ర వాహనాలు వెళ్లడం ఇబ్బందిగా మారింది. ఈ రూట్లో డ్రైనేజీ నిర్మాణం సైతం చేపట్టకపోవడంతో పాటు, అతిధి బార్ సమీపంలో బిటి రోడ్డు మోకాళ్ళ లోతు గుంతలతో పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్డు గుంతల వద్ద ఇటీవల భారీ వర్షానికి పూర్తిగా మట్టి రోడ్డుగా మారింది. ఈ రూట్లో రెండు మర్రుల వద్ద బస్సు, వాహనాలు వచ్చినప్పుడు కనీసం సైకిల్ కూడా వెళ్లే పరిస్థితి లేదు. మెయిన్ రోడ్డులో పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ.. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదని మున్సిపల్ ప్రజలు వాపోతున్నారు. మున్సిపాలిటీలో అన్ని రకాల పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రజలకు, వ్యాపారులకు సౌకర్యాలు ఎందుకు కల్పించడంలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నార్కెట్ పల్లి రూట్లో మెయిన్ రోడ్డు వెంట రోడ్డు విస్తరణతో పాటు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని గుంతల మయంగా మారిన బి టి రోడ్డు కి బదులు పకడ్బందీగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a Reply