ఉపాసన మార్గం, విచారణ మార్గం అంటే ఏమిటి?

ఉపాసన మనసుతో చేసేది, విచారణ బుద్ధితో చేసేది. మనసును బుద్ధితో ఆత్మలో విలీనం చేయడం ఆ రెండింటికి సమన్వయం. ఉప అంటే సమీపంలో, ఆసన అంటే కూర్చోవడం. పూర్తిగా చూస్తే పరమాత్మ సమీపంలో మనసుని ఉంచడం ఉపాసన. కనులు మూసుకొని చేతిలో జపమాలతో మనసులో మరొక చింతనతో చేసేది జపం కాదు. మనసును పూర్తిగా పరమాత్మయందే ఉంచాలి. పరమాత్మ పాదాలతో మొదలుకొని అది పూర్తిగా మనసులో నిలుపుకున్నాక ప్రతి అవయవాన్ని మనసులో నిలుపుకోవాలి. ఏ పని చేసినా పరమాత్మ పాదాలు లేదా బాహువులు లేదా ముఖ మండలం కనబడాలి. ఈవిధంగా సాధన చేస్తే ఏ లోకంలో ఉన్నా పరమాత్మ సన్నిధిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. మన శరీరానికి కావాల్సిన పనులను అప్రయత్నంగానే చేస్తాము. ఏడుస్తూ, నవ్వుతూ, కోపిస్తూ, కలహిస్తూ కూడా తింటాం. అలవాటైన పనికి మనసుతో పనిలేదు. కావున ఉపాసన అలవాటు చేసుకుంటే అంతటా స్వామే కనబడతాడు. ఈవిధంగా స్వామి దగ్గర మనసును ఉంచడం ఉపాసన.
విచారణ అంటే విశేసంగా సంచరించడం. బుద్ధి అన్ని విషయాలకు సంచరించడం సామాన్యం. పరమాత్మయందు సంచరింపజేయడం విశేషం. బుద్ధిని పరమాత్మయందు సంచరింపజేయడం విచారణ, దీనినే ధ్యానం అంటారు. సాధారణంగా ధ్యానం మనసుతో చేయాలని భావిస్తారు. కానీ ధీ ఆన కలిపితే ధ్యాన, ధీ అనగా బుద్ధి, ఆన అనగా బ్రతికించుట. బుద్ధిని బ్రతికించుట అంటే పరమాత్మయందు సంచరింపచేయడమే. బుద్ధిని పరమాత్మయందే ఉంచడం ధ్యానం, అదే విచారణ. మనసును పరమాత్మ సమీపంలో ఉంచుట ఉపాసన, బుద్దిని పరమాత్మయందు ఉంచుట విచారణ. ఈవిధంగా కొన్ని జన్మలు ప్రయత్నిస్తే పరమాత్మ దయతో ఆయనను పొందవచ్చు.

Leave a Reply