ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ బెర్త్ కోసం ఆసీస్ తో జరుగుతున్న కీలక పోరులో.. అఫ్గానిస్థాన్ భారీ స్కోరు నమోదు చేసింది. కంగారూలు దాటికి ఆఫ్ఘాన్ జట్టు ఆలౌట్ అయినప్పటికీ… స్కోరు బోర్డుపై డిఫెండబుల్ టార్గెట్ నే సెట్ చేసింది.
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసి ఆలౌటైంది. ఇందులో వన్ డౌన్ లో వచ్చిన సెదిఖుల్లా అటల్ (85) హాఫ్ సెంచరీ నమోదు చేయగా… ఆఖరి ఓవర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (67) ధనాధన్‌ను సిక్సర్లతో అదరగొట్టాడు. రషీద్ ఖాన్, (19) కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (20), ఇబ్రహీం జద్రాన్ (22) పరువాలేదనిపించారు.
ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వారషూస్ 3 వికెట్లు తీయగా… ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక గ్లెన్ మ్యాక్స్ వెల్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఇక ఆస్ట్రేలియా కూడా ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి నేరుగా సెమీస్‌కు చేరుకోవాలని యోచిస్తోంది. దీంతో నేడు ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యంతో ఆసీస్ బరిలోకి దిగనుంది.