ఉప్పుల మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్

సూర్యాపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ గుండాల చేతిలో హత్యకు గురైన బిఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య కుటుంబాన్ని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గం, నూతనకల్ మండలం, లింగంపల్లి గ్రామంలోని వారి నివాసంలో పరామర్శించారు.

ముందుగా కేటీఆర్ రూ.5 లక్షల చెక్కు అందించి కుటుంబ సభ్యులకు ధైర్యం నింపారు, మీకు అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజాక్షేత్రంలో భయపడి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, దౌర్జన్యాలు చేయడం సరికాదన్నారు.

పదేండ్ల పాలనలో తాము ఎలాంటి దౌర్జన్యాలు చేయలేదని, గులాబీ సైన్యం క్రమశీలతతో ఉందని, తిరిగి దాడులు ఉంటే పరిస్థితి భయంకరమవుతుందన్నారు. మల్లయ్య చనిపోయిన వెంటనే ప్రత్యక్షంగా రావాలనుకున్నానని, సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా ఇబ్బందులు కలగకుండా ఆగినట్లు తెలిపారు. వచ్చే బిఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లయ్య కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే హామీ ఇచ్చారు.

ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ యాభై శాతానికి పైగా గెలుస్తుందని, అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆశగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply