రైతులకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హామీ
ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి : మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హామీ ఇచ్చారు. కృష్ణాజిల్లా ఘంటసాలలో నీట మునిగిన పంట పొలాలను ఆదివారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రైతు వేమూరి రమేష్ పొలాన్ని పరిశీలించి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, బండి పరాత్పరరావు, కొండపల్లి రామకృష్ణ పాల్గొన్నారు.

