మెరుగైన వైద్యం అందించాలి
హోం మంత్రి వంగలపూడి అనిత, రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
కర్నూలు బస్సు దుర్ఘటన స్థలం పరిశీలన
కర్నూలు బ్యూరో, అక్టోబర్ 24, ఆంధ్రప్రభ : ప్రజల ప్రాణ భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. నిర్లక్ష్యానికి పాల్పడిన వారిని వదిలిపెట్టం అని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ,కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘటన స్థలాన్ని శుక్రవారం ఉదయం హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. మంత్రులతో పాటు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్త, డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితర అధికారులు ఉన్నారు. బస్సు దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలిస్తూ, రవాణా శాఖ అధికారులు, స్థానిక పోలీసుల నుంచి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర నివేదిక అందజేయాలని మంత్రులు ఆదేశించారు. వాహన సాంకేతిక ఫిట్‌నెస్, డ్రైవర్ పరిస్థితి, రోడ్ సేఫ్టీ ప్రమాణాలపై దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు.

గాయపడిన వారికి పరామర్శ
అనంతరం ఇద్దరు మంత్రులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో సమావేశమై గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు, అవసరమైన ఔషధాలు, సౌకర్యాలు వెంటనే అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది అని తెలిపారు. ఈ సందర్బంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కూడా మంత్రులతో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


‘




