రైల్వే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం..

రైల్వే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం..
- పప్పుల మిల్లు వద్ద ప్రజలకు ఇబ్బందులు లేకుండా రైల్వే వంతెన నిర్మాణం
- విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలోని సెంట్రల్ నియోజకర్గంలో గత ప్రభుత్వం పట్టించుకోని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేసి చూపుతామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 1వ డివిజన్ మధురానగర్ పప్పుల మిల్లు సెంటర్లోని రైల్వే గేటు ప్రాంతాన్ని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని), సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు రైల్వే, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఆర్ యు బి, ఆర్ ఓ బి నిర్మాణ విషయమై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ.. 2019 – 24 మధ్యకాలంలో విజయవాడ నగర అభివృద్ధి అటకెక్కిందన్నారు. నాటి పాలకులు దోచుకోవడమే తప్పా అభివృద్ధి పై దృష్టి సారించలేదన్నారు. 2024 ఎన్నికల్లో ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా బోండా ఉమామహేశ్వరరావు గెలిచిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల పై దృష్టి సారించామని ఎంపీ శివనాధ్ తెలిపారు. గుణదలలో ఎల్ సి గేట్ నంబర్ 8, 316 పెండింగ్ ప్రాజెక్టులు మంజూరుకు చర్యలు తీసుకున్నామని, అదే విధంగా వాంబే కాలనీ – మధురానగర్ మధ్య ఆర్ యు బి మంజూరు చేయించామన్నారు. కొత్త రాజరాజేశ్వరి పేట – పాత రాజరాజేశ్వరి పేట మధ్య రైల్వే వంతెన నిర్మాణం, మధురానగర్ పప్పుల మిల్లు రైల్వే గేటువద్ద ప్రజలెవ్వరికీ ఇబ్బంది లేకుండా ఆర్ యు బి లేదంటే ఆర్ ఓబి నిర్మాణం జరిగేలా చూస్తున్నామన్నారు.
అందుకు సాధ్యాసాధ్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికారులతో కలిసి వచ్చినట్లు తెలిపారు. గుణదల ప్రాంత అభివృద్ధిని ఆ ప్రాంతంలో నాయకులని చెప్పుకునే వాళ్ళు పట్టించుకోలేదన్నారు. పేరుకే గొప్పలు చెప్పుకుంటూ గుణదల ప్రాంత అభివృద్ధికి తట్టెడు మట్టి కూడా వేయని కొందరు నాయకులు అక్కడ ఉన్నారన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమా సారథ్యంలోనే నియోజకవర్గ పరిధిలోని గుణదల ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. 2029 ఎన్నికలు నాటికి నియోజకవర్గంలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తి చేసేలా చూస్తామని, గత ప్రభుత్వ చేతకానితనాన్ని, కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు చూపిస్తామన్నారు.
ప్రభుత్వ విప్, సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. 2024లో ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి సెంట్రల్ నియోజవర్గ అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. ప్రధానంగా గత పాలకులు పట్టించుకోకుండా వదిలేసిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. 2009లో గుణదల ఆర్ఓబి పనులు నాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రారంభమయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు నాడు అందిన కాడికి దోచుకున్నారన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల దెబ్బకు ఆరఓబి నిర్మాణ కాంట్రాక్టర్ సైతం పారిపోయాడన్నారు. 2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి కాంట్రాక్టర్ కోర్టులో కేసు వేయడంతో గుణదల ఆరఓబి నిర్మాణ విషయాన్ని నాడు పట్టించుకోవడం సాధ్యపడలేదన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ కోర్టుపరమైన ఇబ్బందులు తొలగిపోయినప్పటికీ గుణదల ఆర్ఓబి నిర్మాణం విషయాన్ని పట్టించుకోలేదన్నారు.
2024లో ఎంపీగా కేశినేని శివనాద్, ఎమ్మెల్యేగా నేను గెలిచిన నాటి నుంచి రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల సమస్యల పరిష్కారం విషయమై పలు దఫాలుగా రైల్వే జీఎం, డిఆర్ఎం, ఇతర అధికారులను కలిసామన్నారు. ఢిల్లీ స్థాయిలో ఎంపీ కేశినేని చిన్ని పలు దఫాలు రైల్వే మంత్రిని కలిశారన్నారు. గుణదలలో రెండు ప్రాజెక్టులు 316, గేట్ నెంబర్ 8 వద్ద మంజూరు చేసుకోగలిగామని, 316 గుణదల ఆరఓబి నిర్మాణ పనులు లోని 15 రోజుల్లో ప్రారంభం అవుతాయన్నారు. గుణదల ఉలవచారు కంపెనీ వద్ద నిలిచిపోయిన గుణదల ఆర్ఓబి పనులు పున ప్రారంభిస్తామన్నారు.
మధురానగర్ పప్పుల మిల్లు వద్ద స్థానిక ఇళ్ల వాసులకు ఇబ్బంది లేకుండా రైల్వే గేటు వద్ద ఆర్ఓబి, లేదంటే ఆర్యుబి నిర్మాణం జరిగేలా చూస్తామని గేటు సమీపంలోని కుటుంబాల వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. కార్యక్రమంలో ముందుగా రైల్వే శాఖ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (గతి శక్తి) ఎస్.శ్రీనివాసరావు, నగర పాలక సంస్థ ఈఈ శ్రీనివాసరెడ్డి తదితరులతో పప్పుల మిల్లు వద్ద ఆరఓబీ, లేదంటే ఆర్‌యూబీ నిర్మాణం సాధ్యాసాధ్యాలపై క్షేత్రస్థాయి సమీక్ష చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా రైల్వే గేటు వద్ద వంతెన నిర్మాణం జరిగేలా చూడాలని అధికారులను ఎంపీ, ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు బొప్పన భవకుమార్, 1వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు సురేష్ తదితర నాయకులు, రైల్వే, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

