వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటాం

వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటాం
మార్చి 15 నాటికి బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
వెలుగుమట్ల భూదాన్ బాధితులతో చర్చించి మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి
ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : వెలుగుమట్ల భూదాన్ భూములలో ఉన్న ఆక్రమణల తొలగింపులో నిరాశ్రయానికి గురైన అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి భరోసా కల్పించారు. కలెక్టరేట్ లో వెలుగుమట్ల బాధితులతో చర్చించి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్ లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ స్థలంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు వసూలు చేసినట్లు తమకు సమాచారం వచ్చిందని, బాధితులు ఎవరికైనా డబ్బులు ఇస్తే తమకు సమాచారం అందించాలని అన్నారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులలో అర్హులైన పేదలకు వారి సొంత ప్రాంతంలో ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని మంత్రి భరోసా కల్పించారు.
వెలుగుమట్ల అంశాన్ని కొందరు రాజకీయాలకు వాడుతున్నారని, తాము ఈ అంశాన్ని కేవలం పేదల కోణంలోనే చూస్తున్నట్లు తెలిపారు. పేదలకు ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ప్రభుత్వంలో అన్యాయం జరిగే ప్రసక్తే ఉండదన్నారు. వెలుగుమట్ల ప్రభుత్వ భూదాన్ భూముల ఆక్రమణలో తప్పు ఒకరు చేస్తే, శిక్ష మరొకరికి వచ్చినట్లు కొంతమంది బాధితులు తెలియక అక్కడ ఇండ్ల పట్టాలు పొందామనే భ్రమలో ఇండ్లు కట్టుకున్నారని మంత్రి అన్నారు.
వెలుగుమట్ల సంఘటనలో బాధితులు ఎప్పటినుంచి ఇక్కడ ఉంటున్నారు, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అధికారులతో క్షుణ్ణంగా విచారణ చేయించి నిరుపేదలకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని అన్నారు. వెలుగుమట్ల భూదాన్ భూములలో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇందిరమ్మ ఇళ్లు తీసుకున్నవాళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోందని, అటువంటి వారికి కాకుండా మిగిలిన అర్హులైన పేదలందరికీ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో, సంబంధిత బాధితుల సొంత ప్రాంతాల్లో ఇంటి స్థలం ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు.
బాధితులు వెలుగుమట్ల ఇంటి స్థలం కోసం ఎవరికి డబ్బులు ఇచ్చారో నిర్భయంగా పోలీసు అధికారులకు చెప్పాలని, ఆ డబ్బులు కూడా బాధితులకు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. వెలుగుమట్ల బాధితులకు ఇచ్చే ఇండ్ల దగ్గర అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, త్రాగు నీరు, విద్యుత్ సౌకర్యం, మౌళిక వసతులు కల్పిస్తామని అన్నారు. పేద ప్రజల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, గత పాలకులు వెలుగుమట్ల బాధితులకు పట్టాలు పంపిణీ చేయని కారణంగానే నేడు కూల్చివేతలు జరిగాయని మంత్రి అన్నారు. ప్రతి అంశాన్ని రెచ్చగొట్టే ధోరణితో చూడవద్దని తెలిపారు.
మార్చి 15 నాటికి అర్హులైన పేదలకు తప్పనిసరిగా ఇళ్లస్థలాలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి వెలుగుమట్ల సంఘటన బాధితులకు న్యాయం చేయడానికి తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. మంత్రి వివరణ అనంతరం వెలుగుమట్ల బాధితులు దళారులకు ఎలా డబ్బులు ఇచ్చి మోసపోయామో మీడియా ప్రతినిధుల ఎదుట వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు, వెలుగుమట్ల బాధితులు, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
