- మహిళలు పోరాడే చైతన్యాన్ని మరింత పెంచుకోవాలి
నల్గొండ (ఆంధ్రప్రభ) : మహిళలు పోరాడే చైతన్యాన్ని మరింత పెంచుకుని, స్త్రీ, పురుష సమానత్వం కోసం ఉద్యమించాలని పీఓడబ్ల్యు (ప్రగతిశీల మహిళా సంఘం) జాతీయ నాయకురాళ్లు వి. సంధ్య, జి. ఝాన్సీ మహిళలకు పిలుపునిచ్చారు. ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర రాజకీయ తరగతులు జిల్లా కేంద్రంలోని శ్రామిక భవనంలో ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర అధ్యక్షురాలు జి. అనసూయ పీఓడబ్ల్యు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. మహిళా అమరవీరులను స్మరిస్తూ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ శిక్షణ తరగతులను బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి ప్రారంభించి ప్రసంగించారు.
తొలి సెషన్‌లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హరిత అధ్యక్షత వహించగా, పీఓడబ్ల్యూ జాతీయ నేత వి. సంధ్య మాట్లాడుతూ ఐక్యతే మహిళల బలమని, సామాజిక అభివృద్ధికి మహిళలు ఐక్యంగా ఉద్యమాలు చేయడం ఎంతో అవసరమన్నారు. మహిళా హక్కుల సాధనలో సమస్యలను వెలికితీసి పోరాటం చేయడంలో ప్రగతిశీల మహిళా సంఘం ముందుంటుందని అన్నారు.
ప్రపంచ యుద్ధాలు, వలసలు, మార్కెట్ విస్తరణ, వాణిజ్య పోటీలు ప్రపంచ అగ్ర రాజ్యాల, సామ్రాజ్యవాద దేశాల ప్రపంచ మార్కెట్‌పై పెత్తనం కోసం యుద్ధాలను సృష్టిస్తున్నాయని ఆమె అన్నారు. పాలకుల అండదండలతో బలపడుతున్న పితృస్వామ్య భావజాలం తిరిగి వేళ్లూనుకుంటోందని, సనాతన ధర్మం పేరుతో మహిళలపై, పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండవ సెషన్‌కు కె. జ్యోతి ఆహ్వానం పలకగా, కామ్రేడ్ సీత అధ్యక్షత వహించారు. ‘పని విధానం-ప్రణాళిక-కార్యక్రమం’ అనే అంశాన్ని జాతీయ నాయకురాలు కామ్రేడ్ ఝాన్సీ బోధించారు. మహిళలు సంఘానికి సంబంధించిన ప్రాథమిక విషయాలైన ప్రణాళిక, నిబంధనలు, కర్తవ్యాలు వంటివి తెలుసుకుంటేనే మంచి ఉద్యమకారులుగా ఎదగగలుగుతారని, మహిళలను సమీకరించి నేడు జరుగుతున్న అనేక రకాల సామాజిక దుస్సంఘటనలకు కారణాలను అన్వేషించి పోరాటాలను నిర్మించగలుగుతారని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ, ఆర్. సీత, హరిత, ఎం. జ్యోతి, ఊకే పద్మ, ఆదిలక్ష్మి, లక్ష్మక్క, కె. జ్యోతి, పి. ఉపేంద్ర, లక్ష్మి, భారతి, ఇతర మహిళలు పాల్గొన్నారు.

