Delhi | వారికి ఎమ్మెల్సీ ప‌ద‌వులిచ్చి న్యాయం చేశాం.. సీఎం రేవంత్

న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రాని వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చానని.. అవన్నీ ఇప్పుడు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన వారికి ఒకేసారి 37 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చానన్నారు. అలాగే అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌కు ఎమ్మెల్సీలు ఇచ్చామన్నారు. డీసీసీ అధ్యక్షులందరికీ పదవులు ఇచ్చామని తెలిపారు.

నిరూపించుకోవల‌సిన అవ‌స‌రం లేదు ..
గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధముందని.. ఫొటోలు దిగి చూపించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తానెవరో తెలియకుండానే పీసీసీ అధ్యక్షుడు, సీఎం పదవులకు ఎంపిక చేస్తారా ? అని ప్రశ్నించారు. ఎవరి ట్రాప్ లోనూ తాను పడనని చెప్పారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదని.. అసెంబ్లీలో చర్చకు హాజరుకావాలన్నారు.

హైద‌రాబాద్ లో భార‌త్ స‌మ్మిట్ ..
కేంద్ర కేబినెట్‌లో ఉన్న నిర్మలా సీతారామన్ గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ రాష్ట్రం అంశాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు 253ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తామన్నారు. మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిస్తే సరిపోతుందని.. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో ఏప్రిల్‌ నెలలో మూడు రోజుల పాటు భారత్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 60దేశాల నుంచి అతిథులను ఆహ్వానిస్తున్నామన్నారు. దానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అనుమతి కావాలని.. అందుకే విదేశాంగ శాఖ మంత్రిని కలుస్తున్నట్లు తెలిపారు.

డీలిమిటేష‌న్ పై అఖిల‌ప‌క్షం ..
డీలిమిటేషన్ విధానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి నేతృత్వంలో కమిటీ వేశానన్నారు. అలాగే అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హిస్తున్నామ‌న్నారు రేవంత్. దీనికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణలో అందరి అభిప్రాయాన్ని సేకరించి ఆ తర్వాత డీఎంకే మీటింగ్‌లో తమ వైఖరి చెప్తామన్నారు.

పంట‌లు ఎండుతుంటే బీఆర్ఎస్ నేత‌లు డ్యాన్స్ లు…
పన్నులు వసూలులో దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. పంటలు ఎండిపోయినా, ప్రజల ప్రాణాలు పోతున్నా బీఆర్‌ఎస్ నేతలు డ్యాన్సులు వేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *