భీమవరంలో వాటర్ బోటింగ్ ప్రారంభం

భీమవరంలో వాటర్ బోటింగ్ ప్రారంభం

బోట్ షికార్ చేస్తున్న కలెక్టర్ నాగరాణి


భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: బోటు షికారుని ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కలెక్టర్ చదలవాడ నాగరాణి (Chadalawada Nagarani) కోరారు. భీమవరం ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు నేడు బి.వి. రాజు వీరమ్మ పార్కులో ఏర్పాటు చేసిన బోటు షికారుని ఆమె ప్రారంభించి.. కాసేపు స‌ర‌దాగా బోటులో తిరిగారు. భవ్య భీమవరం పేరిట ఇప్పటికే పట్టణంలో పలు పార్కులు, కూడళ్లు అభివృద్ధి, ఫౌంటెన్స్, స్వాగత ద్వారాలు ఏర్పాటు, డివైడర్స్ కు అందమైన పెయింటింగ్స్, పాత బస్టాండ్ లో నూతన టెర్మినల్ నిర్మాణం, పట్నంలో పలు బస్టాప్ ల నిర్మాణం, ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు తదితర ఎన్నో కార్యక్రమాలను పలువురు దాతల సహకారంతో చేపట్టి భీమవరం సుందరీకరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

విశాఖపట్నం, విజయవాడ వంటి పట్టణాలలో మాత్రమే ఉన్న బోట్ షికార్ ను బివి రాజు ఫౌండేషన్ సహకారంతో నేడు బివి రాజు పార్క్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, పట్టణ ప్రజలు ఎంతో సంతోషించదగిన విషయమన్నారు. పట్టణ ప్రజలకు ఇది ఒక ఆట విడుపులా ఉంటుందన్నారు. భీమవరం పట్టణంలో పిల్లలు, పెద్దలు సెలవు రోజుల్లో ఆనందంగా గడపడానికి ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఏమీ లేవని, దీన్ని దృష్టిలో పెట్టుకొని దశల వారీగా పట్టణంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. బోటింగ్ టైమింగ్స్, ఎంత సమయానికి ఎంత రుసుం చెల్లించాలి, తదితర వివరాలను సూచిస్తూ బోర్డును ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

కార్యక్రమంలో భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ టి.త్రినాధరావు, సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, డీఆర్డిఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా టూరిజం అధికారి ఏ.అప్పారావు, బీవీ రాజు కళాశాల కోఆర్డినేటర్ ఎం.రమేష్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ మంతెన రాంప్రసాద్ రాజు, రెవిన్యూ శాఖ సిబ్బంది గ్రంధి రత్న కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply