శాశ్వతంగా నల్లా కనెక్షన్ కట్
భారీ జరిమానా…
15వ తేది నుంచి ఇంటింటికి చెకింగ్స్
వెల్లడించిన జలమండలి ఎండీ అశోక్
హైదరాబాద్ – హైదరాబాద్ వాసులకు వాటర్ బోర్డ్ హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా నల్లాలకు మోటార్లు బిగిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తాగునీటి నల్లాలకు మోటార్లు బిగిస్తే రూ. 5 వేలు జరిమానా విధిస్తామని, మోటార్‌ను సీజ్ చేయడంతోపాటు నీటి కనెక్షన్ కట్ చేస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 15 నుంచి వాటర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు సూచించారు.
మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్ పేరుతో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు ఎండీ అశోక్ రెడ్డి. నల్లాలకు మోటార్లు బిగించడం వల్ల వాటర్ సప్లయ్ సమయంలో ప్రెజర్ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నల్లా నీటి సరఫరాలో ఫ్రెజర్ సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని.. వాటికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ ప్రజలు నీటిని వృథా చేయకుండా తాగునీటిని వినియోగించుకోవాలని సూచించారు.
కాగా, హైదరాబాద్ మహా నగరంలో జలమండలి పరిధిలో 13.5 లక్షల తాగునీటి నల్లా కనెక్షన్లలో సుమారు 8.5 లక్షల కనెక్షన్లకు ఉచితంగా తాగునీరు అందిస్తోంది. ప్రతి కుటుంబానికి నెలకు సుమారు 20 వేల లీటర్ల వరకు నీటిని సరఫరా చేస్తోంది. నాణ్యతా ప్రమాణాలతో అందించేందుకు సగటున ప్రతి 1000 లీటర్లకు రూ. 48 వ్యయం చేస్తోంది. ఇంత ఖర్చు చేసి ఇస్తున్న తాగునీటిని కొందరు వాహనాలు, ఇంటి పరిసరాలను శుభ్రం చేయడానికి, గార్డెనింగ్ కు వినియోగిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడం గమనార్హం. అలా చేస్తున్న వారిపై కూడా జలమండలి భారీగానే జరిమానాలు విధిస్తున్నది.