తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. రూ.102.1 కోట్లతో మహిళాశక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన ఏడు ఆర్టీసీ బస్సులను లబ్ధిదారులకు అందజేశారు.
ఓరుగల్లు గొప్ప చైతన్యం కలిగిన ప్రాంతమని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో కీలకమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు.
వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.6500 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వరంగల్‌కు విమానాశ్రయం తెచ్చామని, కాజీపేట డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు.
స్టేషన్ ఘనపూర్ శివారు శివునిపల్లిలో ప్రజా పాలన సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శివునిపల్లి కేంద్రం నుంచి విర్చువల్‌గా ప్రారంభించారు. రూ.102.1 కోట్లతో మహిళాశక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన 7 ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి లబ్ధిదారులకు అందజేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 48,717 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీగా 92 కోట్ల 74 లక్షల చెక్కును అందజేశారు. జనగామ జిల్లాలోని 1289 #SHG సంఘాలకు రూ.100.93 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు.
దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-2లో భాగంగా రూ.148.76 కోట్లతో ఆర్‌ఎస్ ఘన్‌పూర్ ప్రధాన కాలువ సీసీ లైనింగ్ పనులు, రూ.25.6 కోట్ల వ్యయంతో స్టేషన్‌ఘన్‌పూర్ నియోకవర్గంలో 750 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు.
ఈ సందర్భంగా “ప్రజాపాలన – ప్రగతి బాట సభ”లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొన్నారు.
ఇక ప్రజాపాలన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఏనాడైన గత ప్రభుత్వం మహిళలను ఆదుకుందా.. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చిందా.. అస్సలు పట్టించుకుందా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ రూ.58 లక్షలు జీతం తీసుకున్నాడన్నారు. మా అప్పులు ఎలా పెరిగాయి.. మీకు లక్ష కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయి అని ప్రశ్నించారు.
రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ గార్లు జాతిపితలు అవుతారు.. కానీ.. తెలంగాణను దోచుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతాడని మండిపడ్డరు. కేసీఆర్ అన్నింటికి బకాయిలు పెట్టి వెళ్లాడన్నారు.
మా ప్రభుత్వం వచ్చాకే వరంగల్ కు ఎయిర్ పోర్ట్ వచ్చిందని.. వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్డు కూడా మా ప్రభుత్వం వచ్చాకే వచ్చిందన్నారు. అంతే కాదు.. మా ప్రభుత్వం వచ్చాకే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. రైతురుణమాఫీ చేసినందుకు నాపై కోపం ఉంటుందా..? లక్ష కోట్లు సంపాదించే నైపుణ్యం ఏంటో మా యువతకు నేర్పాలన్నారు.
కాగా, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ.630.27 కోట్లతో ప్రారంభించిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ.200 కోట్లతో జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, రూ.5.5 కోట్లతో ఘన్‌పూర్‌లో డిగ్రీ కాలేజీ, రూ.45. 5 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్, రూ.148.76 కోట్లతో దేవాదుల రెండో దశ, RS ఘన్‌పూర్ ప్రధాన కాలువ లైనింగ్ పనులు, 512 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, పలు రహదారుల విస్తరణ, సబ్ స్టేషన్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను ప్రారంభించారు.