Vision @ 2047 | అభివృద్ధిలో కలుద్దాం

Vision @ 2047 | అభివృద్ధిలో కలుద్దాం
- ఉద్యోగుల పాత్ర కీలకం..
- సమాచార మంత్రి కొలుసు పార్థసారథి
Vision @ 2047 | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు చేస్తున్న ప్రయాణంలో ఉద్యోగులు అడుగులు కలిపి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని, ముఖ్యమంత్రి ఆకాంక్షల మేరకు ప్రజలకు సేవలందించాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కోరారు. ఏపీ ఎన్‌జీజీవో అసోసియేషన్(AP NGGO Association) రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ నేతృత్వంలో పలువురు అసోసియేషన్ నాయకులు మంగళవారం తాడిగడప సమీపంలోని మంత్రివ క్యాంపు కార్యాలయంలో మంత్రి పార్థసారథిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి విజన్ @ 2047(Vision @ 2047) సాధన వైపు చేస్తున్న ప్రయాణంలో ఉద్యోగులు అడుగులు కలిపి సహకరించేందుకు ముందుండాల్సిన అవసరముందన్నారు. కొన్నేళ్ల పాటు అభివృద్ధిలో గాడితప్పిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి తన అపార అనుభవం, దార్శనికతో అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారన్నారు.
వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు కీలకమైన పారిశ్రామిక, సేవా రంగాల్లో అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడమే కాకండా అంతర్జాతీయ(International) పెట్టుబడుల సదస్సులో రికార్డు స్థాయిలో పెట్టుబడులు సాధించినట్లు వివరించారు. ఈ పెట్టుబడుల ద్వారా మన యువతకు సుస్థిర ఉపాధి అవకాశాలతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టనుందన్నారు. ఈ తరుణంలో అభివృద్ధి కార్యాచరణ అమల్లో ఉద్యోగులు సహకారం ఎంతో కీలకమన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మరింత పారదర్శకతతో ప్రజలకు సేవలందించినప్పుడు అనుకున్న లక్ష్యాలను సాధించ గలుగుతామన్నారు. ఉద్యోగ సమాచారం మాస పత్రికలో ప్రభుత్వ నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల కథనాలు ప్రచురించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను దశల వారీగా పరిష్కరిచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదన్నారు. ఉద్యోగులను ఏకతాటిపై నడిపిస్తూ నిబద్ధతతో సేవలందించేలా ఉద్యోగ సంఘ నేతలు కృషిచేయాలని మంత్రి కోరారు.
ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్(A. Vidyasagar) మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల కోసం ఎంత చిత్తశుద్దితో పారాడుతామో.. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడి ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేస్తున్నారన్నారు. చంద్ర బాబు నాయుడు(Chandra Babu Naidu) విజన్ ఉన్న నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు ఉందని.. ఆయన సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందనే భావనతో ఉద్యోగులందరూ ఐక్యంగా మద్దతు పలికారన్నారు.
ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పథకాలు, కార్యక్రమాల అమలు ద్వారా 100 శాతం(100 percent) ఫలితాలు సాధించేలా ఉద్యోగులు కృషిచేస్తున్నట్లు విద్యాసాగర్ పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా ఉద్యోగుల ప్రయోజనాలపై ప్రత్యేకముగ దృష్టి సారించాలని కోరారు. ఉద్యోగుల హెల్త్ కార్డులపై ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని వేయటం హర్షదాయకమని రెండు నెలల్లోనే ఉద్యోగులు హెల్త్ కార్డులు అందరికీ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.
వేతన సవరణ కమిటీ చైర్మన్ ని నియమించాల్సిన అవసరం ఉందని మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగులకు సంబంధించిన జిపిఎఫ్, ఎపిజిఎల్ఐ, సి పి ఎస్ కంట్రిభూషణ్, గ్రూప్ ఇన్సూరెన్స్ తదితర చెల్లింపుల్లో మంచి పురోగతి ఉన్నప్పటికీ, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలను ప్రత్యేక ప్రాతిపత్తితో క్లియర్ చేయాలని కోరారు.
మంత్రిని కలిసిన వారిలో ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ(DV Ramana), ఎన్‌టీఆర్ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు డీఎస్ఎన్ రెడ్డి, సహాధ్యక్షులు వీవీ ప్రసాద్, డి.రమేష్, ఎం.రాజుబాబు, విజయవాడ నగరశాఖ కార్యవర్గ సభ్యులు సీవీఆర్ ప్రసాద్, ఎస్‌కే నజీరుద్దీన్, మధుసూధనరావు, కె.శివలీల ఉన్నారు.
