విష్ణుసహస్రనామావళి…
భీష్మ చరిత్ర భారతంలో ఒక సమున్నత శిఖరం. అరి భయంకరుడైన భీష్ముడు- భీషణత్వానికి ప్రతీక. ఈ భీషణత్వం ఇంద్రియ నిగ్రహంలోను, అంతశ్శత్రువులను జయించడంలోను ప్రదర్శించి పరిశుద్ధతను సాధించాడు. దేవవ్రతుడనే పేరు కలిగిన ఈ మహాత్ముడు, పితృభక్తిపరుడుగా తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచర్యాన్ని అవలంబించాడు. ‘భీష్మప్రతిజ్ఞ’ జగత్ ప్రసిద్ధం. సత్యనిష్ఠకు పేరుపడిన భీష్ముడు కొన్ని సందర్భాలలో ధర్మాధర్మ నిర్ణయంలో తటస్థంగా ఉన్నా వాటి వెనుక దైవ సంకల్ప జ్ఞానం, ధర్మసూక్ష్మాలు హేతువులుగా ఉన్నాయి. ఆ కొద్ది సందర్భాల ఉపేక్షకు కూడా ‘అంపశయ్య’లో తనను తాను శిక్షించుకున్న నిర్మలుడు, భీష్ముడు. భీష్ముడు గంగా, శంతనుల ఎనిమిదవ సంతానం. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి శంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం తండ్రి ఆనందం కోసం, సుఖసంతోషాల కోసం దేవవ్రతుడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని పెళ్లి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి.. ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యతిగాంచాడు. తనయుడి త్యాగానికి సంతసించిన తండ్రి.. భీష్ముడికి స్వచ్చంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు.
అధర్మపక్షాన నిలబడి, ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే ”భీష్ముడు” మరణాన్ని స్వాగతించాడు. అదే, తన అసమర్థతకు శిక్ష అని భావించి అర్జునుడు బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్యపైకి చేరుకొని.. మరణించే మంచి సమయం కోసం ఎదురు చూస్తూ.. పాండవులకు రాజ్య ధర్మం ఉపదేశించడమే కాదు.. ధర్మ రాజుకి విష్ణుసహస్రనామాలను పదేశించారు. అంపశయ్యగతుడైన భీష్ముని చూసి దేవతలు సైతం దు:ఖించారు. 58 రోజులు అంపశయ్యపై ఉన్న భీష్ముడు మరణ వేదనను అనుభవిస్తూ మానవజన్మకు మహత్తర వరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ గడిపాడు భీష్ముడు.
ఈయన అంపశయ్యపై ఉన్న సమయంలో శ్రీకృష్ణుని ధ్యానిస్తూ యోగంలో ఉన్నారు. ఒక ధర్మవేత్త లోకాన్ని వదిలివెళుతున్న వేళ ఆయన నుంచి తరవాతి తరాలకు విజ్ఞాన సంపద అందాల్ని నిర్ణయించుకున్న కృష్ణుడు, ధర్మ రాజాదులతో శరతల్పగతుడైన భీష్ముని చేరుకున్నాడు. ఒక మహాకాలంలో ఎంతో లోకాన్ని దర్శించిన అనుభవం, శాస్త్రాలను ఆపోశనపట్టిన ధార్మిక విజ్ఞానం ఆయనతోనే అంతరించిపోకూడదని కృష్ణ సంకల్పం. పాలించే బాధ్యతను చేపట్టిన యుధిష్ఠిరునకు ఆయన ఆ ధర్మ సంపదనంతా అందించాలని ఆదేశించాడు పరమాత్మ. యుద్ధంతో అలసి, క్షతగాత్రుడై ఉన్న తాను బుద్ధిని ఏకాగ్రం చేసి సూక్ష్మాంశాలతో విషయాలను వివరించే శక్తిలేని వాడనని, కనుక ఆధర్మాలను శ్రీకృష్ణునే వివరించమని వేడుకుంటాడు భీష్ముడు. కానీ ముకుందుడు, ”తాతా! నీకు అమోఘమైన శారీరక, బుద్ధిశక్తులను అనుగ్రహిస్తున్నాను. వాటితో నీవు నీ అనుభవసారాన్ని ధర్మ సూక్ష్మాలను నీ మనుమనికి అందించి” అని బోధించాడు. ఒక తరం తన తరువాతి తరానికి అందించవలసినది ధర్మాన్నీ, జ్ఞానాన్నీ, అనుభవసారాన్నీ, అంతేగానీ ఆస్తిపాస్తులను మాత్రమే కాదు. ఈ సందేశమే భీష్ముని ద్వారా ధర్మజునికిక్ ధర్మోపదేశం చేయించడంలోని పరమార్థం.
శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాధలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. ”నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుందిఆ నేల ఎంత సారమో.” అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు.అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు ఉంది. ముఖ్యంగా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. భీష్ముడు ఉపదేశించిన సూక్షధర్మాలు, మోక్ష ధర్మాలు మహాభారతంలో శాంతి, అనుశాసనిక పర్వాలుగా అతివిస్తారంగా విరాజిల్లాయి. మహాభారతం వేదాల సారమైతే, ఈ రెండు పర్వాలు భారతానికి సారం. ఇందులో పాలనా ధర్మాలు, రాజధర్మాలు, వ్యక్తి ధర్మాలు, లోకరీతులు, ఉపాసనా ర#హస్యాలు, తత్త్వచింతన…అన్నీ కలబోసుకుని కనపడతాయి. అంటే, భీష్ముడు ఒక సమగ్ర మానవుడిగా ఈ బోధ ద్వారా మరోమారు నిరూపించుకున్నాడు.
- వాడవల్లి శ్రీధర్