మనిషి జీవితం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ప్రతి దశలో ప్రతి ఒక్కరికీ ఎవరో ఒకరి సహాయం అవసరం అవుతుంది కానీ ఊ#హ తెలిసిన తర్వాత శరీర అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తూ ఉన్నంత వరకు ఇతరుల మీద ఆధారపడటం కంటే తమకు తాము తమ పనులను చేసుకోవడంతో పాటు దైవ చింతన, పాప భీతి కలిగి ఉండటం ఎంతో అవసరం.
దైవ చింతన వల్ల మనిషికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలసిన మనసుకు విశ్రాంతి దైవ చింతన, ఇష్టమైన దేవుని సన్నిధిలో గడపడం ద్వారా లభిస్తుంది. మనిషి జీవితంలో సాధు స్వభావం మరియు క్రూర స్వభావం నాణానికి చెరో వైపులా వుంటాయి. ప్రతి వ్యక్తి సాధారణంగా సాధు స్వభావిగా ఉన్నప్పటికీ ఎదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో క్రూర స్వభావం బయటపడే అవకాశం ఉంటుంది. చాలామంది అది బయటపడకుండా నియంత్రించుకోగల సామర్ధ్యాన్ని పెంపొందించుకుంటారు! మరి అది అందరికీ సాధ్యమేనా? అంటే సాధ్యమే! దానికి కావలసిందల్లా దృఢమైన సంకల్పం, దైవచింతన, మానసిక నియంత్రణ మనసును అదుపులో పెట్టుకోవడం.
సాధారణంగా ప్రతి వ్యక్తి కూడా ఎంతో కొంత పాప భీతిని కలిగి ఉంటాడు, ఉండాలి కూడా తను చేసే పని వలన ఏదైనా పాపం జరుగుతుందేమోనని అనుక్షణం ఆలోచిస్తూ పాపభీతిని పొందుతూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే పాపభీతిని కలిగి ఉండటం మనిషిలోని ముఖ్యమైన సద్గుణంగానే భావించాలి. ఎందుకంటే ఒకవేళ పాపభీతే లేకపోతే మనిషి మృగంలా ప్రవర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనిషిలోని మృగాన్ని మేల్కొనకుండా ఎప్పటికప్పుడు పాపభీతి నియంత్రిస్తుంది.
- ఏడుకొండలు కళ్ళేపల్లి