Virat Hindu Sammelan | 24న విరాట్ హిందూ సమ్మేళనం..!

Virat Hindu Sammelan | ఆంధ్రప్రభ, జైనథ్ : హిందూ సనాతన ధర్మ పరిరక్షణ, సాంస్కృతిక వైభవం పై ఈనెల 24న ఆదిలాబాద్ పట్టణం డైట్ కళాశాల మైదానంలో విరాట్ హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు సనాతన హిందూ ధర్మ వేదిక ప్రతినిధులు తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో గోడ ప్రతులను ఆవిష్కరించారు. హిందూ సమ్మేళన కార్యక్రమానికి భువనేశ్వరి పీఠం మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కమలంద భారతి స్వామితో పాటు గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి, హిందూ ధార్మిక ప్రవక్త నారాయణ్ మహారాజ్, శ్రీ కిషన్ మహారాజ్ తో పాటు వివిధ క్షేత్రాల నుండి పీఠాధిపతులు, వేద పండితులు హాజరవుతున్నట్లు సనాతన హిందూ ధర్మ వేదిక జిల్లా అధ్యక్షులు రాఘవేంద్రనాథ్ యాదవ్ తెలిపారు.
వేలాది మంది హిందువుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పీఠాధిపతుల ప్రవచనాలు ఉంటాయన్నారు. అనంతరం వేలాది మంది మహిళల సమక్షంలో, వేద పండితుల ఆశీర్వచనల మధ్య మహా హారతి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల ప్రజలు తరలిరావాలన్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేదిక వ్యవస్థాపకులు జగదీష్ అగర్వాల్, గౌరవ అధ్యక్షులు బోండ్ల నారాయణ, ప్రఫుల్ వజే, క్యాతం శివప్రసాద్ రెడ్డి, ఆలయ కమిటి చైర్మన్ వికెష్ రెడ్డి, బండారి దేవన్న, తోట శివ్వన్న, రాళ్లబండి రాంకిషన్, సుభాష్ జాదవ్, సిడం రాంకిషన్, ఆదివాసీ మహాసభ అధ్యక్షులు కినక సురేష్, విట్టల్, తదితరులు పాల్గొన్నారు.
