VIP visits | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

VIP visits | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
VIP visits | విస్తృత ఏర్పాట్లతో సాఫీగా కనకదుర్గమ్మ దర్శనం
అంతరాలయ, విఐపీ దర్శనాల తాత్కాలిక బ్రేక్..
ఎండ నుండి ఉపశమనానికి తెల్లటి నీరు పంపిణీ
VIP visits | ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా నమోదైంది. సెలవుదినం కావడంతో తెల్లవారుజామున నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో నిలిచారు. రద్దీ అధికంగా ఉన్నప్పటికీ ఆలయ యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టి దర్శనాన్ని ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా నిర్వహించింది. భక్తుల సౌకర్యార్థం ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 02:30 గంటల వరకు అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

ఇదే సమయంలో సామాన్య భక్తులకు వేగవంతమైన దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా విఐపీ దర్శనాలను కూడా ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 03:00 గంటల వరకు నిలిపివేసి, సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, వైర్లెస్ ద్వారా సిబ్బందికి నిరంతరం సూచనలు అందిస్తూ క్యూలైన్లను క్రమబద్ధీకరించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు.

ఉచిత ప్రసాదం పంపిణీ..
ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఉదయం 7:00 గంటల నుంచే ఉచిత ప్రసాద పంపిణీ ప్రారంభమై సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగింది. సుమారు 7,150 మంది భక్తులకు అన్నప్రసాదం అందించడంతో పాటు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు సేవదారులు నిరంతరం తాగునీరు అందించారు. భారీ రద్దీ ఉన్నప్పటికీ భక్తులందరికీ ప్రశాంత వాతావరణంలో, త్వరితగతిన అమ్మవారి దర్శనం లభించేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
