Vijayawada | రైతులకు వెన్నుపోటు.. కార్పొరేట్లకు వరం

Vijayawada | రైతులకు వెన్నుపోటు.. కార్పొరేట్లకు వరం

భారత్, అమెరికా ఒప్పందం దేశ వ్యవసాయానికి ముప్పు..
కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు భార్గవ్ వల్లూరు

Vijayawada | విజయవాడ, ఆంధ్రప్రభ : భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం భారత రైతాంగానికి ప్రత్యక్ష దాడితో సమానమని విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు భర్గవ్ వల్లూరు తీవ్రంగా విమర్శించారు. దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా అమెరికా నుంచి తక్కువ ధరలతో, భారీ సబ్సిడీలు పొందిన వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లలోకి వెల్లువలా ప్రవేశించే ప్రమాదం ఉందని, దీని వల్ల దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కుప్పకూలి చిన్న, సన్నకారు రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడతారని హెచ్చరించారు. ఈ ఒప్పందం వల్ల విదేశీ మారకద్రవ్యపు నిల్వలు స్వదేశాలకు వెళ్లి, వేగంగా పెరిగి, దేశ వాణిజ్య లోటు మరింత పెరుగుతుందని అన్నారు.

రైతులను రక్షించుకునేందుకు ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలకు శాశ్వతంగా గండిపడుతుందని, వ్యవసాయ రంగంలో దేశానికి ఉన్న స్వావలంబన విధాన స్వేచ్ఛను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని స్పష్టం చేశారు. సంప్రదాయ వ్యవసాయ వ్యవస్థ క్రమంగా బలహీనపడి, వ్యవసాయ రంగం పై కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం పెరుగుతుందని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఆధునిక సాంకేతికత కోసం విదేశీ అగ్రిబిజినెస్ కంపెనీల పై ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల దేశపు విత్తన స్వాధీనత వ్యవసాయ ఇన్‌పుట్ల పై స్వయంపోషణ పూర్తిగా దెబ్బతింటుందని పేర్కొన్నారు.

ఈ ఒప్పందం ప్రభావాలు తీవ్రంగా ఉంటాయని, గ్రామీణ నిరుద్యోగం పెరగడం, ఉపాధి కోసం వలసలు పెరగడం, పర్యావరణ నాశనం, ప్రాంతాల మధ్య అసమానతలు మరింత లోతుగా మారడం వంటి పరిణామాలు తప్పవని అన్నారు. విదేశీ దిగుమతుల పై అధికంగా ఆధారపడటం వల్ల దేశ వ్యూహాత్మక భద్రతకే ముప్పు ఏర్పడుతుందని, ఆహార భద్రత, దీర్ఘకాలిక స్వావలంబన ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు ఈ ఒప్పందం పూర్తి విరుద్ధమని, దీని వల్ల లాభాలు రైతులకు కాకుండా కార్పొరేట్ సంస్థలు, ఎగుమతిదారులకే దక్కుతాయని భార్గవ్ ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఏ ఒప్పందానికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు.

Leave a Reply