Vijayawada | కనకదుర్గ నగర్ లో ఉద్రిక్తత

Vijayawada | కనకదుర్గ నగర్ లో ఉద్రిక్తత

  • భక్తుడిపై చేయి చేసుకున్న సెక్యూరిటీ సిబ్బంది..
  • కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం..
  • పవిత్ర క్షేత్రంలో దౌర్జన్యంపై భక్తులు, స్థానికుల ఆగ్రహం

Vijayawada | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వివాదం చోటుచేసుకుంది. కనకదుర్గ నగర్ లో కారు పార్కింగ్ అంశంపై తలెత్తిన వాగ్వాదం చివరకు దాడికి దారి తీసింది. ఈ ఘటనలో ఒక భక్తుడిపై ఆలయ సెక్యూరిటీ సిబ్బంది చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్కింగ్ స్థలంలో వాహనం నిలిపే విషయంలో భక్తుడు ప్రశ్నించడంతో సెక్యూరిటీ సిబ్బంది విచక్షణ కోల్పోయి దాడికి దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తులతో మర్యాదగా వ్యవహరించాల్సిన సిబ్బంది ఇలా దౌర్జన్యానికి పాల్పడడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ ఘటనపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానంలో శాంతి, భద్రతను కాపాడాల్సిన సిబ్బందే భక్తులపై దాడికి పాల్పడటం అత్యంత దురదృష్టకరమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఘటనపై దేవస్థాన అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply