మార్చి 31 నాటికి విద్యుత్ స్తంభాల ఏర్పాటు పూర్తి చేయాలి..

మార్చి 31 నాటికి విద్యుత్ స్తంభాల ఏర్పాటు పూర్తి చేయాలి..

జిల్లా కలెక్టర్ రాజకుమారి

నంద్యాల,బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ఆర్డీఎస్‌ఎస్‌ పథకం కింద వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ స్తంభాల పనులను సంబంధిత శాఖలు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేసి, మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆర్డీఎస్‌ఎస్‌ పథకం అమలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, శ్రీశైలం సబ్ డీఎఫ్‌ఓ బబితా కుమారి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంక, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా అందిస్తూ నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఆర్డీఎస్‌ఎస్‌ పథకం ద్వారా విద్యుత్ ట్రిప్పులు తగ్గించి, లో వోల్టేజ్ సమస్యలను నివారిస్తూ స్థిరమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆర్ & బీ రహదారులకు సంబంధించిన 7 ప్రదేశాల్లో ఇరువైపుల విద్యుత్ స్తంభాల ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అంతరాయాలు లేకుండా సంబంధిత శాఖలు, రెవెన్యూ సిబ్బంది పరస్పర సమన్వయంతో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

నేషనల్ హైవే పరిధిలోని 11 ప్రదేశాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను సంబంధిత అధికారులు సంయుక్తంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అటవీ శాఖ పరిధిలోని 4 ప్రదేశాల్లో పెండింగ్ పనులపై సంబంధిత అధికారులతో చర్చించి వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పరిసరాల్లో ఏర్పాటు చేసిన 15 విద్యుత్ స్తంభాల పనులను కూడా సంబంధిత శాఖలతో కలిసి పరిశీలించి పూర్తి చేయాలని ఆదేశించారు.

టోల్ గేట్ల పరిసరాల్లో అధిక సాంద్రతతో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వల్ల పంటల దిగుబడిపై ప్రభావం పడుతోందని రైతుల నుంచి పీజీఆర్ఎస్‌లో వినతులు వస్తున్న నేపథ్యంలో, ఆ సమస్యలను గమనించి తగిన పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply