ఉపరాష్ట్రపతి పోలింగ్‌కు స‌ర్వం సిద్ధం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : భారతదేశ ఉపరాష్ట్రపతి (Vice President) పదవి కోసం రేపు (మంగ‌ళ‌వారం) ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ కూటమి (NDA alliance) నుంచి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan), ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి (B. Sudarshan Reddy)లు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు భవనం(Parliament building)లోని వసుధ కాంప్లెక్స్‌లో పోలింగ్ జరగనుంది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ (PC Modi) రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఓట్ల లెక్కింపు అదే రోజు సాయంత్రం 6 గంటలకు చేపట్టి ఫలితాన్ని వెల్లడిస్తారు. ఎన్నికల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, అదే రోజు సాయంత్రం ఫలితం వెల్లడవుతుంది.

ఉపరాష్ట్రపతి ఎన్నుకునేందుకు ఓటింగ్ లో పాల్గొననున్న మొత్తం 782 మంది సభ్యులు.. లోకసభ లోని 543 మంది సభ్యులు ( ప్రస్తుతం 1 స్థానం ఖాళీ, రాజ్యసభ లోని 233 మంది సభ్యులు ( ప్రస్తుతం 5 ఖాళీలు), 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు ఓటర్లు. సింపుల్ మెజారిటీ తో గెలుపొందనున్న అభ్యర్థి.. మొత్తం సభ్యులు ఓటింగ్ లో పాల్గొంటే, 392 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే గెలుపు. చెల్లుబాటైన ఓట్లలో సగాని కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన అభ్యర్ధిదే గెలుపుగా పరిగణిస్తారు.

సంఖ్యాబలం పరంగా చూస్తే ఎన్‌డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఉభయ సభల్లోని 781 మంది సభ్యుల్లో ఎన్‌డీఏ(NDA)కు 425 మంది బలం ఉండగా, ‘ఇండియా’ కూటమికి 311 మంది సభ్యులున్నారు. వైసీపీ (YSRCP) ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ప్రకటించడంతో ఆ కూటమి బలం మరింత పెరిగింది. బీజేడీ మద్దతు కోసం ప్రధాని మోదీ ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్‌తో స్వయంగా మాట్లాడారు. బీఆర్‌ఎస్ తమ నిర్ణయాన్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం..
రేపు జరుగనున్న భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్డీఏ, ఇండియా‌ కూటమి.. రెండూ తెలంగాణకు ద్రోహం చేశాయంటోన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తటస్థ వైఖరి అవలంభించాలని చూస్తున్నట్టు సమాచారం. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు, ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఇదే సరైన నిర్ణయమని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

Leave a Reply