పుర‌స్కారం ప్ర‌దానం చేసిన వెంక‌య్య‌నాయుడు

పుర‌స్కారం ప్ర‌దానం చేసిన వెంక‌య్య‌నాయుడు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రఖ్యాత భూమి హ‌క్కుల సంస్కర్త, న్యాయ‌ నిపుణులు, రైతు న్యాయవాది ఎం.సునీల్ కుమార్‌(M. Sunil Kumar) (భూమి సునీల్‌)కు ‘భూమి ర‌త్న(Bhumi Ratna)’ పుర‌స్కారం ల‌భించింది. ఈ పుర‌స్కారాన్ని రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్తంగా ప్ర‌దానం చేసింది. ఈ రోజు హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేసి భూమి సునీల్‌ను సత్కరించారు.

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన సునీల్‌కుమార్ గత 20 ఏళ్లుగా భూ సంస్కరణలు, గ్రామీణ చట్టపరమైన సాధికారత, వ్యవసాయ చట్టాలు, విధానాల రూపకల్పనలో విశేష సేవలందిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Government of Andhra Pradesh)లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో రాష్ట్ర లీగల్ కో-ఆర్డినేటర్‌గా పనిచేసిన సమయంలో ఆయన నేతృత్వంలో అమలు చేసిన కమ్యూనిటీ పారా లీగల్ ప్రోగ్రాం ద్వారా ప‌ది లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలు తమ భూములపై హక్కులు పొందగలిగాయి.

భూమి సునీల్ రూరల్ డెవెలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్(Rural Development Institute) (ఆర్డీఐ) డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో రైతులకు న్యాయ అవగాహన పెంపొందించడం, భూమి పరిపాలనా వ్యవస్థల బలోపేతం, భూసంస్కరణ విధానాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. నీతి ఆయోగ్ ల్యాండ్ లీజింగ్ నిపుణుల కమిటీ, భారత ప్రభుత్వ ల్యాండ్ టాస్క్‌ఫోర్స్, పలు రాష్ట్ర స్థాయి భూసంస్కరణ కమిటీలలో సభ్యుడిగా కూడా ఆయన విశేష సేవలందించారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీలో సభ్యుడిగా ఉన్నప్పుడు భూ పరిపాలన మెరుగుదలకు ఆయన చేసిన సూచనలు, అలాగే భూభారతి చట్టం(Bhubharati Act) రూపకల్పనలో ఆయ‌న చేసిన పాత్ర ఎంతో కీలకంగా మారింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడిగా, అలాగే 2018లో తాను స్థాపించిన లీగల్ ఎంప‌వ‌ర్‌మెంట్‌ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (ఎల్‌ఈఏఎఫ్‌ఎస్) అధ్యక్షుడుగా పని చేస్తున్నారు.

ఈ ఎల్ఈఏఎఫ్‌ఎస్ ద్వారా నిర్వహిస్తున్న న్యాయ గంట, భూ న్యాయ శిబిరాలు, సాగు న్యాయ యాత్ర వంటి కార్యక్రమాలు రైతులకు ఉచిత న్యాయ‌ సహాయాన్ని అందిస్తున్నాయి. ఈ సంస్థ తెలంగాణ గ్రామాల్లో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌(Agri Legal Aid Clinic) కీలక భూమిక పోషించింది. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో అనుబంధ ఆచార్యులు, సలహాదారుడిగా కూడా సునీల్‌కుమార్ సేవలందిస్తున్నారు.

ఇంతే కాకుండా ఎంసీహెచ్ఆర్డీ, ఏపీ హెచ్ఆర్డీ(AP HRD), టీఏపీఏఆర్డీ, న్యాయ, పోలీసు అకాడమీలలో రిసోర్స్ ప‌ర్సన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. రైతుల భూమి హక్కులపై అవగాహన పెంచడానికి ఆయన భూమి కోసం, మీ భూమి.. మీ హక్కు, వంటి టెలివిజన్, డిజిటల్ కార్యక్రమాలు, భూమికోసం, సాగు న్యాయం వంటి యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ప్రజలకు చట్టాల‌పై అవగాహన క‌ల్పిస్తున్నారు.

Leave a Reply