- వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి దేశాయి లక్ష్మీదేవి విజయం
- ఎన్నికను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య
వెల్దుర్తి, మార్చి 27 (ఆంధ్రప్రభ) : వెల్దుర్తి ఎంపీపీ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి దేశాయిలక్ష్మీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెల్దుర్తి ఎంపీపీ అభ్యర్థి బొమ్మన సరళ రవి రెడ్డి ఏడాది క్రితం రాజీనామా చేశారు. వెల్దుర్తి ఇన్చార్జి ఎంపీపీగా రంగయ్య కొనసాగారు. ఖాళీగా ఉన్న ఎంపీపీ నోటిఫికేషన్ భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో 27వ తేదీన ఎన్నికల అధికారి తులసి దేవి అధ్యక్షతన ఎంపీపీ ఎన్నిక జరిగింది.
మండలంలోని 17మంది ఎంపీటీసీల గానూ 14 మంది వైఎస్ఆర్సిపి ఎంపీటీసీలు హాజరయ్యారు. దేశాయి లక్ష్మీదేవిని బొమ్మన రవి రెడ్డి ప్రతిపాదించగా, చెరుకులపాడు ఎంపీటీసీ రాజేశ్వరి బలపరిచారు. దీన్ని ఏకీభవిస్తూ ఎంపీటీసీలు ఆమోదించారు. దీంతో ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అనంతరం ఎన్నికల అధికారి తులసి దేవి చేతుల మీదుగా ఆమెకు ఎంపిక పత్రాన్ని అందజేశారు. ఈ ఎన్నికను పరిశీలించడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య హాజరయ్యారు. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ మధుసూదన్ ఆధ్వర్యంలో ఎస్సై అశోక్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బందిని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.