త్రివర్ణ కాంతుల్లో మార్మోగిన ‘వందే మాతరం’

తిర్యాణి, ఆంధ్రప్రభ : జాతీయ జెండాలతో అలరారుతున్న చౌరస్తా, చేతుల్లో త్రివర్ణ పతాకాలు, ముఖాల్లో ఉత్సాహం.. ఆ క్షణం దేశభక్తి పరవశంతో నిండిపోయింది. వందేమాతరం అంటూ చిన్నారుల స్వరాలు ఒకటై మార్మోగాయి. సత్యమేవ జయతే ఫౌండేషన్ తెలంగాణ, సైనిక్ యూత్ మోటివేషన్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమం దేశప్రేమకు ప్రతీకగా నిలిచింది. ఆశ్రమ పాఠశాల, జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు సామూహికంగా గేయం ఆలపించగా, కొమురం భీం చౌరస్తా త్రివర్ణ పతాకాలతో కాంతులీనింది. చిన్నారులు “వందేమాతరం” అంటూ గళమెత్తిన క్షణం చూసిన వారందరి గుండెల్లో దేశభక్తి ఉప్పొంగింది.
ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జ్ మూలమట్టం శివ మాట్లాడుతూ వందే మాతరం గీతం అప్పట్లో బ్రిటిష్ పాలనను సవాలు చేసిందని, నేటికీ అదే స్పూర్తి మనలో సజీవంగా ఉందన్నారు. ఈ రెండు పదాలు ‘వందే మాతరం’ దేశమాత పట్ల మన ప్రేమకు ప్రతీక అని, మనమందరం ఒకే స్వరంతో పాడటం భారతమాతకు ఇచ్చే అత్యున్నత గౌరవమని ఆయన పేర్కొన్నారు. దేశభక్తి స్ఫూర్తితో ముగిసిన ఈ వేడుకలో విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు రంగు అరుణ్ కుమార్, ఏఎస్‌ఐ రాథోడ్ నారాయణ, పాఠశాల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
